- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదట గుడిసెలు.. ఆపై నిర్మాణాలు!
బుల్కాపూర్ నాలాపై కొందరు పలు దుకాణాలు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. ఒక చోట జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయగా..

మొదట గుడిసెలు.. ఆపై నిర్మాణాలు!
- ఇదీ మణికొండలో బుల్కాపూర్ నాలా కబ్జా ఓపెన్ సీక్రెట్
- ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం
- అక్రమార్కులకు వరంగా మారిన వైనం
- కబ్జాను పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు
- నాలా కబ్జా చేసి ఏకంగా జిరాక్స్ సెంటర్ ఏర్పాటు
- హైడ్రాకు సైతం ఫిర్యాదులు
దిశ, గండిపేట: మణికొండ మున్సిపాలిటీలో బుల్కాపూర్ నాలా క్రమక్రమంగా అన్యాక్రాంతమవుతున్నది. నాలాను ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నాలాపై, దానిని ఆనుకొని ముందుగా గుడిసెలు వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత గుడిసెలను తొలగించి వాటి స్థానంలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తతంగమంతా ఆయా శాఖల అధికారులకు స్పష్టంగా తెలిసినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. నాలా కబ్జాను అడ్డుకోవలసిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
దుకాణాలు ఏర్పాటు చేసి దందా..
బుల్కాపూర్ నాలాపై కొందరు పలు దుకాణాలు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. ఒక చోట జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయగా.. వివిధ దుకాణాలు, గుడిసెలు కూడా వెలిశాయి. అదేవిధంగా మర్రిచెట్టు సర్కిల్ సమీపంలో కూడా నాలాను అనుకొని గుడిసెలు ఏర్పాటు చేసుకొని, అందులో దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నాలా కబ్జా వ్యవహారంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో దృష్టి సారిస్తూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు.. బాధ్యత తమది కాదన్నట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
హైడ్రాకు ఫిర్యాదు
బుల్కాపూర్ నాలా కబ్జాపై ఇప్పటికే పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. నాలా క్రమంగా కబ్జా అవుతుండడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు.. వరదలు పొంగిపొర్లి నివాసిత ప్రాంతాల్లోకి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. ఇదంతా అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.
‘బుల్కాపూర్ ‘ను రక్షించకపోతే ఇబ్బందులు
మణికొండ మున్సిపల్ పరిధిలో బుల్కాపూర్ నాలాను పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నో నిర్మాణ సంస్థలు బుల్కాపూర్ నాలాను ఆక్రమించుకున్నాయి. నాలాను కాపాడకపోతే మణికొండ మున్సిపల్ పరిధిలో భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలి. నాలా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
= సీతారాం ధూళిపాళ్ల , బీఆర్ఎస్ మణికొండ మున్సిపాలిటీ ప్రెసిడెంట్






