ఇంటి అనుమతుల కోసం రూ.20 వేల లంచం డిమాండ్

by Kodari Anjali |

బడంగ్ పేట్ సర్కిల్ టీపీఎస్ దినేష్ అవినీతి బాగోతం బయటపడింది.

ఇంటి అనుమతుల కోసం రూ.20 వేల లంచం డిమాండ్
X

దిశ, బడంగ్‌‌పేట్: బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి బా గోతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బడంగ్ పేట్ సర్కిల్ టీపీఎస్ దినేష్ కుమార్ ఇంటి అదనపు ఫ్లోర్ల నిర్మాణ అనుమతుల కోసం 20,000 రూపాయలు లంచం తీసుకున్నారని బాధితుడు నాగరాజు బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయం ముందు మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ టీపీఎస్ దినేష్ బ్రాహ్మణపల్లిలోని తన ఇంటికి పిలిపించుకొని భేరసారాలు ఆడినట్టు బాధితుడు తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రతి ఫైల్‌కి ఒక రేటు చొప్పున వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే ఫైల్ రిజెక్ట్ చేస్తున్నాడని బాధితుడు నాగరాజు తెలిపారు. గతంలో టీపీఎస్ సెక్షన్ ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేసిన ఇద్దరు చైన్ మెన్ అడ్డుపెట్టుకొని దందా చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. మిగతా ఫైల్స్ క్లియర్ చేయాలంటే సమర్పించుకోవాల్సిందే అని దినేష్ తమతో చెప్పినట్టు బాధితులు నాగరాజ్ తెలిపారు.

చివరికి 60 గజాల ఇంటి అనుమతులను..

బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో ప్లానర్స్‌కి సరిగా ప్లాన్ ఇవ్వడం రాదని గతంలో తుర్కయంజాల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసిన దినేష్, తన స్నేహితుని వద్ద ప్లాన్ తీసుకుంటే త్వరగా అప్రూవల్ అవుతుందని తెలిపారని టౌన్ ప్లానర్ వెంకటేశం తెలిపారు. చివరికి 60 గజాల ఇంటి అనుమతులను కూడా రిజెక్ట్ చేస్తున్నారని వాటికి కూడా ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు ఇస్తున్నారని బాధితులు ఆరోపించారు. డిప్యూటేషన్ పై బడంగ్ పేట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీగా పని చేసిన కిరణ్, గత కొన్ని రోజుల క్రితం నారాయణపేటకు తిరిగి వెళ్లినట్టు సమాచారం.

పదిమంది అధికారులు సస్పెండ్ అయినా తీరు మారలే..

గతంలో పదిమంది అధికారులు సస్పెండ్ అయిన టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు మాత్రం అవినీతి విషయంలో తగ్గేదే అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. తమకు కావలసింది ఇస్తే ఎలాంటి అనుమతులైన ఇట్టే ఇచ్చేస్తున్నారని.. అడిగింది ఇవ్వకుంటే ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి నిలయంగా మారిందని వైరల్ అవుతున్న ఆడియోపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. వైరల్ అవుతున్న ఆడియో రికార్డుపై డీసీ సమ్మయ్య ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి.

డీసీ సమ్మయ్య వివరణ..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని డీసీ సమ్మయ్య స్పష్టం చేశారు.

Next Story