విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు!

by Geesa Chandu |

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు అధికంగా పడుతుండడంతో సీజనల్, విష జ్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు!
X

దిశ ప్రతినిధి, వికారాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు అధికంగా పడుతుండడంతో సీజనల్, విష జ్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా లాంటి వ్యాధులు నియంత్రణలోనే ఉన్నా, డెంగీ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 166, వికారాబాద్ జిల్లాలో 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు, సరైన మందులు లేక చాలా వరకు రోగులు ప్రైవేట్ హాస్పటల్‌ను ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లా, కోట్‌పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయానికి డాక్టర్లు, సిబ్బంది రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కోట్‌పల్లిలోనే కాకుండా జిల్లాలో ఒకటి, రెండు మినహా మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతతో పాటు ఉన్న సిబ్బంది కూడా సమయానికి రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోగుల పరిస్థితి విషమంగా ఉన్నా రాత్రి సమయాల్లో అత్యవసర చికిత్స కావాలన్నా తాండూర్ లేదా వికారాబాద్ పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది.

జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక డెంగీ కేసులు నమోదు..

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌లోని జీహె చ్ఎంసీ పరిధిలోనే డెంగీ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. జీహె చ్ఎంసీ పరిధిలో అధిక జనాభా ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లోనే అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొత్తంగా 166 డెంగీ కేసులు నమోదైతే శేరిలింగంపల్లిలో 42, రాజేంద్రనగర్‌లో 42 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 107, మున్సిపాలిటీ పరిధిలో 53 కేసులు నమో దు కాగా.. రూరల్ ప్రాంతాల్లో అత్యల్పం గా కేవలం ఆరు డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా మొ త్తంగా మలేరియా కేసులు 3, చికున్ గు న్యా కేసులు 13 నమోదు కాగా, వికారాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విష జ్వరాలు రోజురోజుకూ పె రుగుతుండడంతో ఆసుపత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. వచ్చే రెండు నెలలు సెప్టెంబర్, అక్టోబర్‌లో విష జ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాచిన నీటినే తాగాలని, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.

Next Story