- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చల్లారని బడంగ్‌పేట్ ‘పొలిటికల్ వార్’.. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేలా బీఆర్‌ఎస్ ప్లాన్!
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ కార్పోరేషన్ లో జరిగిన భారీ అవినీతిపై కొనసాగుతున్న ‘పొలిటికల్ వార్’ ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించడం లేదు. అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ కార్పోరేషన్ లో జరిగిన భారీ అవినీతిపై కొనసాగుతున్న ‘పొలిటికల్ వార్’ ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించడం లేదు. అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి బీజేపీ పార్టీ ఇక్కడి అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూ వస్తోంది. అధికారులు నోరు తెరిస్తే అసలు సూత్రధారులు ఎవరో తేలిపోతుందని నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. సమగ్ర విచారణ చేయాలని బీజేపీ పార్టీ పెద్దలు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆలస్యంగానైనా బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకే ఆమె సీఎంకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. సమగ్ర విచారణకు కాంగ్రెస్ పెద్దలు సైతం డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేదంటే అవినీతి మచ్చను తుడుపుకోలేని పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడనుంది. ఇక్కడ జరిగిన అవినీతిని బ్రహ్మాస్త్రంలా వాడుకుని కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్లాన్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో.. వేచి చూడాల్సిందే.
అదృశ్య శక్తులపై చర్యలు తీసుకోవాలి..
బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో అక్రమాలకు బాధ్యులైన 10 మంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు వెలికితీసిన అవినీతి ‘మంచుకొండ కొన’ లాంటిదని, కూకటి వేళ్లతో సహా పెకిలించాలంటే మరింత లోతైన విచారణ అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులతోనే సరిపెట్టకుండా అక్రమాలను ప్రోత్సహించిన వారిని, లబ్ధిపొందిన అదృశ్య శక్తులను తీసుకొచ్చి విచారించాలని కోరారు. కార్పోరేషన్ హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి కమిటీతో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
నిర్మాణ అనుమతుల్లో బరితెగింపు..
భవన నిర్మాణ అనుమతుల్లో బరితెగించి నిబంధనలకు విరుద్దంగా ఒకే ప్లాట్ పై ఏకంగా పది వరకు ఇంటి నిర్మాణ అనుమతులను మంజూరు చేసిన అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలను ఆక్రమించడంతోపాటు నాలాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలను పునరుద్దరించడంతోపాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణకు చర్యలు చేపట్టాలన్నారు. గతంలో నగర పంచాయతీగా నుంచి కార్పోరేషన్‌గా కొనసాగే వరకు మాజీ సర్పంచ్ ల తీర్మాణాల పేరుతో అడ్డగోలుగా వెంచర్లు చేశారని, నిబంధనలకు విరుద్దంగా ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులను ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో ప్రైవేటు వెంచర్లలో చేసిన పనులకు సంబంధించిన మంజూరును రద్దు చేయాలని, పనులు పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసిన కాంట్రాక్టర్ల వివరాలను బహిర్గతం చేయడంతోపాటు వారిని బ్లాక్ లిస్టులో పెట్టి సొమ్మును రికవరీ చేయాలని కోరారు. కీలకమైన ఫైళ్లను మాయం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. చెరువుల సుందరీకరణ పనులపై కూడా సమగ్ర విచారణ జరపాలని సబితా ఇంద్రారెడ్డి, సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.






