స్థానికంలో మహిళలే.. నిర్ణేతలు!?

by Jakkula.Mamatha |

పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

స్థానికంలో మహిళలే.. నిర్ణేతలు!?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: పల్లె పోరు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 2న తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది. వికారాబాద్‌ జిల్లాలోని 20 మండలాల జాబితాను చూస్తే.. పురుషుల కంటే 11,118 మంది మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ జిల్లాలోని 17 మండలాల్లో మహిళా ఓటర్ల హవానే కొనసాగుతోంది. రెండు జిల్లాలోని పలు మండలాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటంతో వారే పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలుపు, ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నారు.

రెండు జిల్లాల్లో ఓటర్లు 14,50,737 మంది..

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై కసరత్తు చేసిన అధికారులు ఓటరు జాబితాకు తుది రూపం తీసుకొచ్చారు. వార్డుల వారీగా రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను గ్రామపంచాయతీల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు మరో వార్డులో ఉండటం, ఓటర్ల పేర్ల విషయంలో తప్పులు జరగడం వంటి అభ్యంతరాలు ఉన్నాయి. డబుల్‌ ఓట్లు, చనిపోయిన వారి ఓట్ల విషయంలోనూ చాలాచోట్ల అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.

ఇందుకుగాను ఆయా పంచాయతీల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాక తుది జాబితాను ఈ నెల 2న విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం..రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల పరిధిలోని 526 గ్రామ పంచాయతీల్లో మొత్తం 7,52,259 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,76,823 మంది ఉండగా.. స్త్రీలు 3,75,408 మంది ఉన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 594 పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 6,98,478 మంది ఉండగా.. ఇందులో పురుషులు 3,43,672 మంది, స్త్రీలు 3,54,790 మంది ఉన్నారు.

27 మండలాల్లో మహిళా ఓటర్లే అధికం..

అధికారులు ఇటీవల విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. చాలా చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో వీరి సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండగా.. వికారాబాద్‌ జిల్లాలో ఏకంగా 17 మండలాల్లో మహిళలే ఆధిక్యతతో ఉన్నారు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను మహిళలే శాసించే అవకాశం ఉంది.

మహిళా ఓటర్లు అధికంగా ఉన్న మండలాల వివరాలు ఇలా..

-రంగారెడ్డి జిల్లాలో..

మండలం పురుషులు స్త్రీలు

అబ్దుల్లాపూర్‌‌మెట్‌ 17,740 17,841

ఫరూక్‌ నగర్‌ 25,396 25,704

ఇబ్రహీంపట్నం 15,780 16,053

కేశంపేట 18,316 18,631

కొందుర్గు 11,680 11,979

మహేశ్వరం 22,233 22,351

నందిగామ 13,732 13,826

శంషాబాద్‌ 16,488 16,825

శంకర్‌పల్లి 18,709 19,089

యాచారం 24,973 25,221

వికారాబాద్‌ జిల్లాలో..

మండలం పురుషులు స్త్రీలు

బంట్వారం 8,555 9,034

కోట్‌‌పల్లి 10,492 10,935

మోమిన్‌‌పేట్‌ 19,616 19,959

వికారాబాద్‌ 11,928 12,309

ధారూరు 17,797 18,464

బషీరాబాద్‌ 19,452 21,538

తాండూరు 22,686 23,958

యాలాల్‌ 18,399 20,309

పెద్దే ముల్‌ 19,804 21,024

బొంరాస్ పేట్‌ 15,894 16,226

దౌల్తా‌బాద్‌ 20,017 20,952

దుద్యాల్‌ 10,257 10,832

కొడంగల్‌ 15,782 16,423

కులకుచర్ల 19,066 19,316

దోమ 22,056 22,129

పరిగి 15,488 15,650

పూడూరు 21,738 21,855

Next Story