- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ డీలర్లపై చర్యలు తప్పవా..?
దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నజర్ పెట్టినట్టు తెలుస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రేషన్ బియ్యం కమీషన్ పేరు మీద రేషన్ డీలర్ల సంఘం నేతలు బాహాటంగా చేసిన అక్రమ వసూళ్ల పర్వం సివిల్ సప్లయ్ శాఖకే మచ్చను తెచ్చింది. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు సంబంధించిన పూర్తి నివేదికను కమిషనర్ తెప్పించుకున్నట్లు తెలిసింది. ‘దిశ’ పత్రికలో వచ్చిన వరుస కథనాలపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. సంఘం పేరుతో రేషన్ డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ అందరిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వేటు ఎవరి పైన ?
పెండింగులో ఉన్న రేషన్ బియ్యం కేంద్రం కమీషన్ రావాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ ఓ రేషన్ డీలర్ల సంఘానికి చెందిన నేతలు ఇటీవల పలువురు డీలర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. సంక్షేమ నిధి పేరుతో వసూలు చేసినట్లు వారు చెబుతున్నప్పటికీ.. వాట్సాప్ చాటింగ్, వాయిస్ రికార్డింగులు మాత్రం కేంద్రం కమీషన్ కోసమేనని తేటతెల్లం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే సివిల్ సప్లయ్ కమిషనర్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయి? అన్న విషయంలో ఓ జిల్లా స్థాయి అధికారితో పాటు సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు బాధ్యులైన రేషన్ డీలర్ల పై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కు ఇచ్చిన లేఖలో వసూలు చేసిన విషయాన్ని సంఘం నేతలు కూడా అంగీకరించారు. అయితే ఈ వసూళ్లు సంక్షేమ నిధి కోసమేనని అందులో బుకాయించారు. ఏదిఏమైనా యూపీఐ స్కానర్ తో వసూలు చేసినట్లు పక్కా సాక్ష్యాలు ఉండడంతో సంబంధిత డీలర్‌తో పాటు సంఘం నేతలపై చర్యలు తప్పవని తెలుస్తోంది.
వసూల్ రాజాలకు వత్తాసు..
వసూల్ రాజాలకు సివిల్ సప్లయ్ శాఖలోనే ఉన్నత స్థాయిలో పని చేస్తున్న అధికారి ఒకరు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వసూళ్ల ఉదంతం నేపథ్యంలో అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సదరు అధికారి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే జిల్లాలో ఆ అధికారి పనిచేసి ఉండటంతో ఆ పరిచయంతోనే ఇక్కడి డీలర్లతో సత్సంబంధాలు నేటికీ కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగానే తమపై ఎలాంటి చర్యలు ఉండవనే ధీమాతో అక్రమార్కులు ఉన్నట్లు తెలిసింది. అధికారుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న కొందరు రేషన్ డీలర్ల సంఘం నేతల వ్యవహారం సివిల్ సప్లయ్ శాఖకే కళంకం తెస్తోంది. ఈ పరిస్థితుల్లో వసూల్ రాజాలపై వేటు వేస్తేనే ఈ తరహా వ్యవహారాలకు చెక్ పడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.






