గంజాయిని త‌ర‌లిస్తున్న యువ‌కుడు అరెస్ట్

by Ratna Kumari |

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడిని షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

గంజాయిని త‌ర‌లిస్తున్న యువ‌కుడు అరెస్ట్
X
దిశ, షాద్ నగర్ : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడిని షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. షాద్ నగర్ పట్టణ సీఐ కె. సీతారాం కథనం ప్రకారం.. పట్టణ సమీపంలోని ఎలికట్ట చౌరస్తాలో శుక్రవారం రాత్రి ఎస్సై ప్రణయ్ కుమార్ సిబ్బందితో వాహనాల తనిఖీని నిర్వహించారు. పోలీసులను చూసి ఓ యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్ ను పోలీసులు తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. నిందితుడు చోటు కుమార్(21) బతుకుతెరువు కోసం బీహార్ రాష్ట్రం నుంచి వలస వచ్చి కూలీ పనులను చేస్తూ ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో రెండు నెలలుగా నివాసముంటున్నట్టు తెలిపారు.

చోటు కుమార్ కు గతంలోనే గంజాయి సేవించే అలవాటు ఉందని దీంతో ఎలికట్ట గ్రామంలో నివసిస్తున్న నీరజ్ కుమార్ అనే గంజాయి విక్రేతతో నిందితునికి పరిచయం ఏర్పడింది. అతని వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎలికట్ట పరిసర ప్రాంతాలలోని పరిశ్రమలలో పని చేస్తున్న కూలీలకు నిందితుడు అధిక ధరకు గంజాయిని విక్రయించేవాడు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న చోటు కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గంజాయి సరఫరా మూలాలు, ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో గాని డయల్ 112 కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Next Story