రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Ratna Kumari |

రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న చేవెళ్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, చేవెళ్ల : రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న చేవెళ్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వికారాబాద్ జిల్లా ఎత్బ‌ర్ ప‌ల్లి గ్రామానికి చెందిన వినీల్ (19), చేవెళ్ల మండ‌లం దేవుని ఎర్ర‌వ‌ల్లి గ్రామానికి చెందిన అభిలాష్ (19) ఇద్ద‌రు బైకు పై నాగ‌ర్ గూడ నుంచి చేవెళ్ల‌ వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌రెడ్డి గూడ గ్రామానికి చెందిన రాఘ‌వేంద‌ర్ రెడ్డి (45) చేవెళ్ల నుంచి పామెన‌కు వెళ్లేందుకు యూట‌ర్న్ తీసుకుంటుండ‌గా.. అతివేగంగా వ‌చ్చిన బైకు ఢీ కొట్టింది. బైకుపై ఉన్న ఇద్ద‌రు యువ‌కులు కింద ప‌డిపోయారు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో వెంట‌నే స్థానికులు అక్క‌డికి చేరుకొని చేవెళ్ల‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే వినీల్ మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.


కారులో ఉన్న రాఘ‌వేంద‌ర్ కి కూడా గాయాలు కావ‌డంతో బోల్తా ప‌డిన కారును లేపి రాఘ‌వేంద‌ర్ ను స్థానికులు బ‌య‌టికి తీశారు. అభిలాష్ ను మెరుగైన వైద్య చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం తెలుసుకున్న చేవెళ్ల పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేశారు. మృతి చెందిన యువ‌కుడు చేవెళ్ల మున్సిప‌ల్ ప‌రిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ మీనాక్షి స‌త్య‌నారాయ‌ణ మేన‌ల్లుడు అని స‌మాచారం.

80-120 వేగంతో..

ప్ర‌త్య‌క్ష సాక్షుల అభిప్రాయం ప్ర‌కారం.. బుల్లెట్ బైకు పై చాలా వేగంగా వ‌చ్చార‌ని.. స్పీడ్ దాదాపు 80 నుంచి 120 వర‌కు ఉంద‌ని.. ఆ వేగాన్ని చూసి తాము ఆశ్చ‌ర్య‌పోయామ‌ని సాక్షులు పేర్కొంటున్నారు. చిన్న వ‌య‌స్సు పిల్ల‌ల‌కు బైకులు ఇవ్వ‌డం వ‌ల్ల బాధ్య‌త‌, అవ‌గాహ‌న లేని డ్రైవింగ్ తో రోడ్డు ప్ర‌మాదాల‌కు గురై ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని.. చివ‌రికీ త‌ల్లిదండ్రుల‌కు క‌న్నీళ్లు మిగులుతున్నాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు త‌ల్లిదండ్రులు.

Next Story