- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంపశయ్యపై ఆడపిల్ల!..
అమ్మ కడుపులో ఆడ పిల్ల ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. బాహ్య ప్రపంచాన్ని చూడకముందే ఆ శిశువుకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో: అమ్మ కడుపులో ఆడ పిల్ల ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. బాహ్య ప్రపంచాన్ని చూడకముందే ఆ శిశువుకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. పోనీ.. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని అమ్మ పొత్తిళ్ల నుంచి బయటకు వచ్చాక కూడా ఆ పసికందుకు రక్షణ ఉండటం లేదు. పేదరిక పరిస్థితుల కారణంగా.. ఆడపిల్ల అంగట్లో బొమ్మలా మారుతోంది. కొంతమంది దీన్ని వ్యాపారంగా మల్చుకుని ఫెర్టిలిటీ, సరోగసిల ముసుగులో అక్రమ దందాను సాగిస్తున్నారు. అనాగరిక చర్యలకు అంతం పలికామని అంతా చెప్పుకుంటున్నప్పటికీ షాద్ నగర్ నియోజకవర్గంలోని లాల్ సింగ్ తండాలో తాజాగా వెలుగు చూసిన శిశు విక్రయం అంతర్లీనంగా జరుగుతున్న దందాకు అద్దం పట్టేలా చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఆధునిక యుగంలోనూ నేటికీ శిశు విక్రయాల ఉదంతాలు వెలుగులోకి వస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివిధ శాఖల పర్యవేక్షణ కొరవడడంతో ఆడపిల్ల బతుకు అంపశయ్యపైకి చేరి వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుండడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.
ఆగని శిశు విక్రయాలు..
చెట్టుకు కాయ బరువా!..తల్లికి బిడ్డ బరువా!. అన్నది నానుడి. కానీ.. అందుకు భిన్న పరిస్థితులు నేడు సమాజంలో కనిపిస్తున్నాయి. పేదరిక పరిస్థితులు కన్న పేగును దూరం చేస్తుండగా.. కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చుకుని ముఠాగా ఏర్పడి శిశు విక్రయాలను ప్రోత్సహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం చేవెళ్ల మండలం బస్తేపూర్ లో 20 రోజుల పసికందును విక్రయించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. అంతకుముందు నాలుగేళ్ల క్రితం ఎల్లమ్మ తండాలోనూ శిశు విక్రయం వెలుగుచూసింది. పిల్లలను కొనుగోలు చేసి అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను గత యేడాది పోలీసులు పట్టుకున్న ఉదంతం సైతం జిల్లాలో ఉంది. ఏడాది క్రితం మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామ శివారులోని పత్తే సాగర్ చెరువులో శిశువు మృతదేహం లభ్యం కావడం అందరినీ గగుర్పాటుకు గురి చేసింది.
అనాగరిక చర్యలకు అంతం పలికిందని అందరూ అనుకుంటున్న తరుణంలో తాజాగా షాద్ నగర్ నియోజకవర్గంలోని లాల్ సింగ్ తండాలో శిశు విక్రయం వెలుగు జూడటం కలకలం రేపుతోంది. జిల్లాలో ఈ తరహా ఉదంతాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి లాల్ సింగ్ తండా ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. వివిధ శాఖలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగానే ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డను ప్రసవించే వరకు వైద్య, ఐసీడీఎస్ శాఖలు నిఘాను ఉంచితే ఈ తరహా ఘటనలకు చాలావరకు చెక్ పడే అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖ సహకారంతో బాల్య వివాహాలు జరగకుండా పర్యవేక్షణ ఉంచితే ఆడ పిల్లలకు కాస్తంతనైనా భరోసా కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అడ్డగోలు వ్యాపారం..
శిశు విక్రయాలకు పాల్పడడం.. బ్రూణ హత్యలకు పాల్పడడం వంటివి అనైతికం, నేరమని తెలిసినప్పటికీ అడ్డుగోలు సంపాదన కోసం కొందరు అక్రమ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్దమని తెలిసినప్పటికీ ఆర్‌ఎంపీ వైద్యులతో పాటు ప్రొఫెషనల్ డాక్టర్లు సైతం గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుట్టేది ఆడా? మగా! అని ప్రకటించడంపై నిషేధం ఉన్నప్పటికీ మగబిడ్డపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని కొందరు వైద్యులు ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డని పరీక్షల్లో తెలిసిన మరుక్షణం ఊపిరి తీసేసి బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. విద్యావంతులు అధికంగా ఉండే రంగారెడ్డి జిల్లాలోనూ లింగ నిర్ధారణ పరీక్షల పట్ల చాలామంది ఆసక్తి చూపుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరో పక్క ఫెర్టిలిటీ, సరోగసి కేంద్రాలలోనూ పెద్ద ఎత్తున అక్రమ దందా నడుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో వెలుగుజూసింది ఈ తరహా మోసమే. అబార్షన్ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లలను సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వారు కొనుగోలు చేసేవారు. అనంతరం వారిని సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. జిల్లాలో నడుస్తున్న అనేక సెంటర్లలోనూ ఇదే పరిస్థితి అంతర్లీనంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆతర్వాత సంబంధిత అధికారులు సైలెంట్ గా ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యశాఖ అధికారులు తరచుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి నిఘాను ఉంచితే ఈ తరహా ఘటనలు పునరావృతం కావనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
అడ్డదారులు తొక్కుతున్న దంపతులు..
వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ప్రభుత్వం శిశు గృహ, బాల సదన్ లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. పిల్లలు వద్దనుకునే వారు స్వచ్చందంగా అప్పగిస్తే వారికి కూడా ఆశ్రయం కల్పిస్తున్నారు. ఏదైన కారణం చేత సంతానం కలగని దంపతులు శిశు గృహ, బాల సదన్ లలో ఆశ్రయం పొందుతున్న పిల్లలను చట్టబద్దంగా దత్తత తీసుకునే అవకాశం ఉంది. కానీ.. ఈ విధానంపై అవగాహన లేకపోవడం, ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో పిల్లలు లేని దంపతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని కొందరు దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడిన సమయంలో దళారులతో పాటు విక్రయించిన వాళ్లు, కొనుగోలు చేసిన దంపతులు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చట్టబద్దంగా దత్తత తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






