మహా విస్తరణ..మహా అభివృద్ది

by velandi.Saikiran |   (  Updated:2025-11-25 21:15:55  IST  )

మహా విస్తరణ..మహా అభివృద్ది
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్‌‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. గతేడాది రంగారెడ్డి జిల్లాలోని 12 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా..జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు మంగళవారం కేబినేట్‌ ఆమోదం తెలిపింది. గ్రేటర్‌ కార్పోరేషన్‌ తో పోలిస్తే.. అభివృద్ది విషయంలో జిల్లాలోని మున్సిపాలిటీల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న మున్సిపాలిటీల అభివృద్ది చేసే ఆస్కారం కలగనున్నది.

గత యేడాదే మొదలైన విలీన ప్రక్రియ..

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650చ.కి.మీటర్లు. దీన్ని ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరిస్తే 2,200చ.కి.మీటర్లకు పరిధి పెరుగుతుంది. హైదరాబాద్‌ నగరంలోనే ఓ భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీ పాలనలో వ్యత్యాసం ఉండడం.. దీని వల్ల సమన్వయం లోపించి నగరాభివృద్ది ప్రణాళికాబద్దంగా జరగట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఓఆర్‌ఆర్‌ హద్దుగా ఒకే నగరానికి శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే భావించారు. జీహెచ్‌ఎంసీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను విలీనం చేయడానికి ముందు ఓఆర్‌ఆర్‌ లోపల, బయట ఉన్న కొన్ని పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసేందుకు గత యేడాదే ఆర్డినెన్స్​‍ను తీసుకొచ్చారు. తాజాగా..ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తోంది.

జీహెచ్‌ఎంసీ విస్తరణ ఇలా....

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 15 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 8 మున్సిపాలిటీలు, 3 కార్పోరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతున్నాయి.

విలీనం అయ్యే మున్సిపాలిటీలు : శంషాబాద్‌, పెద్ద అంబర్‌ పేట్‌, తుర్కయంజాల్‌, జల్‌ పల్లి, తుక్కుగూడ, ఆది భట్ల, మణికొండ, నార్సింగి

విలీనం అయ్యే కార్పొరేషన్లు : బడంగ్‌ పేట, మీర్‌ పేట్‌, బండ్లగూడ జాగీర్‌,

మిగిలిపోయిన మున్సిపాలిటీలు :

ఇబ్రహీం పట్నం, ఆమన్‌ గల్‌, కొత్తూరు, షాద్‌ నగర్‌, చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌‌పల్లి.

పెరగనున్న డివిజన్లు ..

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల విలీన ప్రక్రియ పూర్తయ్యాక డివిజన్లను ఎన్ని పెంచాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం కింద ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి. భవిష్యత్తులో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణను దృష్టిలో ఉంచుకుని డివిజన్లు, సర్కిళ్లు, జోన్ల హద్దులను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదికపైనే అవుతోంది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరికి జీహెచ్ఎంసీ కాల పరిమితి తీరిపోతోంది. అయితే పాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని రెండు అంతకంటే ఎక్కువ భాగాలుగా విడగొట్టి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందన్న టాక్‌ సైతం విన్పిస్తోంది

పరిపాలన మార్పుతో అభివృద్ది వేగవంతం..

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఆయా వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నగరాభివృద్ది ప్రణాళికలో భాగంగా.. ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ది ప్రణాళికలను రూపొందించనున్నారు. పట్టణీకరణ సైతం గణనీయంగా పెరగనుండగా..అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పారిశుద్ద్యం, నీటి సరఫరా వంటి సేవలతోపాటు టీ ఫైబర్‌, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ వంటి అత్యాధునిక సదుపాయాలకు సంబంధించిన పనులు వేగవంతం అవుతాయి. పౌర సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడడంతో పాటు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం సైతం ఊపందుకుని ప్రజల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడతాయి.

Next Story