- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
192 ఎకరాల అసైన్డ్ భూమి..కబ్జాకు భారీ స్కెచ్..!
వికారాబాద్ సిద్దలూరు పాయగాలో గల సర్వే నెంబర్ 176లో గల 192 ఎకరాల అసైన్ భూమిపై బడా నేతల కన్ను పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

192 ఎకరాల అసైన్డ్ భూమి
కబ్జాకు భారీ స్కెచ్..!
ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను..!
రాష్ట్ర స్థాయిలో బడా నాయకుల పాచికలు
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం
ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటాం అనేలా అధికారుల వ్యవహారం
దిశ, వికారాబాద్ ప్రతినిధి : జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. జిల్లా పరిధి నుండి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుండడంతో పాటు వికారాబాద్ మండలం అలాగే మున్సిపల్ తదితర ప్రాంతాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్లాయి. దాంతో ఈ ప్రాంతంలోని భూములకు రేట్లు అంతంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ మండలంలోని సిద్దులూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సిద్దలూరు పాయగాలో గల సర్వే నెంబర్ 176లో గల 192 ఎకరాల అసైన్ భూమిపై కొందరు రాష్ట్రస్థాయి బడా నేతల కన్ను పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సర్వే నెంబర్ లోని 192 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు భారీ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సర్వే నెంబర్ 176 లో 222.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులో నుంచి భూమిలేని స్థానిక నిరుపేద దళిత, నిరిజన రైతులకు సాగు లేదా నివాసం కోసం 192.13 ఎకరాల భూమిని అసైన్ చేయగా, అందులో నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవి విరమణ పొందిన 10 మంది సైనికులకు దాదాపు 36 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సర్వే నెంబర్ 90లో 20 ఎకరాల భూమిని పట్టా చేయడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆర్మీ వ్యక్తులు తమ భూములను వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకోవడం జరిగింది. అక్కడ నుంచి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి కొన్న భూములతో పాటు పక్కనే ఉన్న మిగతా దాదాపు 147 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం సబ్జా చేయాలని భారీ స్కెచ్ వేయడం జరిగింది.
ప్రభుత్వ భూములపై రాష్ట్ర స్థాయి బడా నాయకుల కన్ను..!
అసైన్డ్ భూమిని కబ్జా చేయడంలో భాగంగా గత 5,6 సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులను డబ్బుతో కొనుగోలు చేసి సర్వే నెంబర్ 176 భూమి చుట్టూ మొత్తం కంచవేసి కబ్జాలోకి వెళ్లారు. అక్కడ పంటలు పండిస్తున్న కొందరు రైతులకు నామమాత్రంగా డబ్బులు ఇచ్చి 99 సంవత్సరాల లీజు కింద అగ్రిమెంట్ రాసుకున్నట్లు కొందరు బాధిత రైతుల వారసులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భూముల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో.. లీజు పేరుతో రియల్ వ్యాపారులకు భూములు కట్టబెట్టిన రైతుల వారసులు మా భూములు మాకు ఇవ్వాలి అంటూ కబ్జాలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. దాంతో అనేకసార్లు గొడవలు జరగడం పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ తగ్గకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్న వికారాబాద్ మండలం అలాగే జిల్లా ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత రైతుల వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన మా సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటల్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో అక్రమ నిర్మాణం..
ఇదిలా ఉంటే ఓ హోటల్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో గత 2024 డిసెంబర్ 19 నాడు 5 ఎకరాల భూమిని నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ భూమిలో ప్రభుత్వ సంబంధిత శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద స్థాయిలో ఒక అక్రమ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతులకు పెట్టుకున్నప్పటికీ సదురు నిర్మాణా ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు అంటూ అనుమతులు రద్దు చేయడం జరిగింది. అయినా కూడా నిర్మాణ పనులు మాత్రం ఆగడం లేదు. జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీ శాఖ అధికారులు ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది, మాకు ఎలాంటి సంబంధం లేదు అనేలా సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం యదేచ్చగా కొనసాగుతుంది. ఈ విషయమై రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులను వివరణ కోరగా, మా వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.
99 సంవత్సరాలు లీజు చట్టబద్ధం కాదు..
- వికారాబాద్ తహశీల్దార్ లక్ష్మీనారాయణ
99 సంవత్సరాలు లీజు అనేది చట్టబద్ధం కాదు. అలా ఎవరు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసైన్డ్ భూమిని ప్రభుత్వం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే రైతులకు అసైన్డ్ చేయడం జరిగింది. అలాంటి భూమిలో వ్యవసాయం చేయడం తప్ప ఎలాంటి నిర్మాణాలు, ఇతర వ్యవహారాలు చేయరాదు. అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.






