అది ప్రజలకు తెలుసు.. రియల్ ఎస్టేట్ రంగంపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రియల్ ఎస్టేట్ వ్యాపారం నమ్మకంపై ఆధారపడి అభివృద్ధి చెందుతుందని, ఈ రంగంలో క్రెడిబిలిటీ (విశ్వసనీయత), మంచి రెప్యుటేషన్‌ చాలా ముఖ్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ..

అది ప్రజలకు తెలుసు.. రియల్ ఎస్టేట్ రంగంపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ వ్యాపారం నమ్మకంపై ఆధారపడి అభివృద్ధి చెందుతుందని, ఈ రంగంలో క్రెడిబిలిటీ (విశ్వసనీయత), మంచి రెప్యుటేషన్‌ చాలా ముఖ్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధ‌వారం బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌లో నిర్వహించిన రియల్టర్స్ సమ్మిట్ - 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కేవలం ఒక ప్రాపర్టీని విక్రయించి, కమిషన్ లేదా వ్యాపార లాభాలు పొందడం మాత్రమే లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. వినియోగదారుడికి మంచి, సురక్షితమైన ప్రాపర్టీని అందిస్తున్నామా లేదా అనే బాధ్యత ప్రతి రియల్టర్‌పై ఉందని పేర్కొన్నారు.

‘మీరు మీ కోసం ఒక ప్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. అదే స్థాయిలో వినియోగదారుడికి ప్రాపర్టీ అందించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత బిడ్డకు వివాహం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తామో, స్థిరాస్తి కొనుగోలు సమయంలో కూడా అంతే జాగ్రత్తగా పరిశీలించాలి’అని హైడ్రా క‌మిష‌న‌ర్ కొనుగోలుదారుల‌కు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు.. మార్కెట్లో నిల‌బ‌డాలంటే.. పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమన్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం కాస్త మంద‌గించ‌డానికి హైడ్రా కార‌ణం కాద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ‌, ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితులు, ఉద్యోగాలు, జీతాలు ఇలా అనేక అంశాలు రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ప్ర‌భావం చూపుతున్నాయ‌న్నారు. ఒక్క హైద‌రాబాద్‌లోనే కాదు.. దేశంలోని ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో కూడా రియ‌ల్ ఎస్టేట్ రంగం కాస్త మంద‌గించింద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని కోరారు.

మార్పు లేనిదే అభివృద్ధి లేదు..

హైద‌రాబాద్‌ను మెరుగైన, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ న‌గ‌రంగా మార్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని రంగనాథ్ అన్నారు. ఇలాంటి ఆలోచ‌న‌ల నుంచే హైడ్రా అనే సంస్థ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వివిధ శాఖ‌ల‌కు చెందిన‌ అధికారాల‌ను అవ‌స‌రం మేర‌కు క‌ట్ట‌బెట్టి.. హైడ్రా ద్వారా ఒక మార్పు తీసుకురావాలని ప్ర‌భుత్వం భావిస్తోందని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. మార్పు తీసుకురావాలంటే కొన్ని ప్రాథమిక ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే సమాజ ప్రయోజనం కోసం ఆ మార్పు అవసరమని అన్నారు. ఇటీవ‌ల ఒడిశాలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశంలో వివిధ దేశాల‌తో పాటు.. ముఖ్య‌మైన న‌గ‌రాల ప్ర‌తినిధులు హైడ్రా కార్య‌క‌లాపాల‌పై ఆస‌క్తి చూపించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కోవాలంటే.. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను సాధించాలంటే.. హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌న్నారు. ‘చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగంగా ముందుగా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాం.. త‌ర్వాత అభివృద్ధి చేశాం.. ఇప్పుడు ఆ ఫ‌లాల‌ను స్థానికులు ఆశ్వాదిస్తున్నారు. మంగ‌ళ‌వారం భారీ వ‌ర్షం కురిసింది. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరింది. గ‌తంలో ఈ వ‌ర‌ద అక్క‌డ బ‌స్తీల‌ను, కాల‌నీలను ముంచెత్తేది. బ‌తుక‌మ్మ కుంట కాదు.. ఆ స్థ‌లం నాది అని వాదిస్తున్న వారి మాటల్లో నిజం లేద‌నేది హైడ్రా ప‌రిశోధ‌న‌లో వెళ్ల‌డైంది. చెరువుల‌ను గుర్తించ‌డంతో పాటు.. వాటి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డం, పున‌రుద్ధ‌రించ‌డంలో హైడ్రా చాలా శాస్త్రీయంగా ముందుకెళ్తోంది.’అని రంగనాథ్ అన్నారు.

హైడ్రా ఏర్పాటు చేసి 23 నెల‌ల్లో రూ. 1.10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూమిని కాపాడిందని, ఈ ఏడాది మ‌రో రూ. ల‌క్ష కోట్ల మేర ప్ర‌భుత్వ, ప్ర‌జా ఆస్తుల‌ను కాపాడే ప‌నిలో హైడ్రా ఉంద‌న్నారు. పేద‌వారికి న‌ష్టం లేకుండానే ఇదంతా చేసిందని, బ‌డాబాబులుగా స‌మాజంలో చెలామ‌ణి అవుతూ.. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డినవారే హైడ్రాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. హైడ్రా వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌లు తెలుసుకున్నార‌ని చెప్పారు.

Next Story