కాంగ్రెస్​పార్టీ ఎస్‌ఐఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోంది : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 57 కోట్ల మంది ఓటర్ల వివరాల ప్రక్షాళన పూర్తిగా మరో 37 కోట్ల మంది ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రక్రియలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్​పార్టీ ఎస్‌ఐఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోంది : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X
  • వారు గెలిస్తే ఒక మాట, బీజేపీ గెలిస్తే మరో మాట అనడం సరికాదు
  • ఎస్‌ఐఆర్​అనేది ఎన్నికల సంఘం నిర్వహించే చట్టబద్దమైన ప్రక్రియ

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 57 కోట్ల మంది ఓటర్ల వివరాల ప్రక్షాళన పూర్తిగా మరో 37 కోట్ల మంది ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రక్రియలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ అనేది భారత ఎన్నికల సంఘం చేపట్టే ప్రక్రియ. దీనికి కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయాలకు ఎస్‌ఐఆర్ కారణమని వ్యాఖ్యానించడం సరికాదు. అదే ప్రమాణాన్ని తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన విజయాలను ఎలా సమర్థిస్తారని, ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు ఎస్‌ఐఆర్, ఈవీఎంలు కానీ ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేస్తుంది. గెలిచినప్పుడు మాత్రం వాటి గురించి మాట్లాడదని ఇటువంటి బ్లేమ్ గేమ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. ఎస్‌ఐఆర్ అనేది భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు మానుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలి. ఎస్‌ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కావడంతో తప్పనిసరిగా జరగాల్సిందే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకుని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా సహకరించాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ చొరబాటుదారులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వంటి అనర్హ వ్యక్తులు ఓటరు జాబితాల్లో చోటు చేసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story