జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన అప్పుడే.. రివీల్ చేసిన రాంచందర్ రావు

by Gantepaka Srikanth |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) సుపరిపాలన, వికసిత్ భారత్ లక్ష్యంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సోమవారం పలువురు బీజేపీలో చేరారని రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలిపారు.

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన అప్పుడే.. రివీల్ చేసిన రాంచందర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) సుపరిపాలన, వికసిత్ భారత్ లక్ష్యంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సోమవారం పలువురు బీజేపీలో చేరారని రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలిపారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు(Ramchander Rao) మాట్లాడుతూ... బీజేపీలో అనేక మంది మేధావులు, విద్యావంతులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో, ఆ అంశం సుప్రీంకోర్టుకు చేరే అవకాశమున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్రీకృతమైందని అన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ బోర్డు నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తున్నాడా? అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు.

‘‘జూబ్లీహిల్స్‌లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగా లేవు. ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేని నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పి, విషాదనగరంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచాక వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 వాగ్ధానాలు చేశారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసుల్లానే మిగిలింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీని గెలిపించాలి’’ అని రాంచందర్ రావు కోరారు.

Next Story