రజినీకాంత్ - జీవన్ రెడ్డి: ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే!

by Gantepaka Srikanth |

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా హైడ్రామా నడుస్తోంది.

రజినీకాంత్ - జీవన్ రెడ్డి: ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా హైడ్రామా నడుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి గంటలు గడవకముందే, జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక ఆసక్తికర పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి అభిమానులు, అనుచరులు ఆయన ఇంటి గోడలపై అంటించిన ఈ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు జీవన్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. వాటి మధ్యలో రజనీకాంత్ ఫేమస్ డైలాగ్.. "నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే!" అని రాసి ఉండటం విశేషం. ఈ పోస్టర్ ద్వారా అనుచరులు పరోక్షంగా ఒక సందేశాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటే, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.

కరీంనగర్ రాజకీయాల్లో 'హాట్ టాపిక్'..

గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి, పార్టీని వీడుతున్నారన్న వార్త కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి వరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే మొగ్గు చూపారు. తాజాగా వెలసిన ఈ పోస్టర్లు చూస్తుంటే, జీవన్ రెడ్డి మనసు మార్చుకునే అవకాశం లేదని, ఆయన 'తగ్గేదేలే' అంటున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ. మరి ఈ సంక్షోభాన్ని అధిష్ఠానం ఎలా ఎదుర్కొంటుంది?. పీసీసీ చీఫ్ లేదా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆయనను శాంతింపజేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story