- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కల్లోలం.. మరోసారి రాజీనామా అస్త్రం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన చేస్తున్న ప్రకటనలు, ట్వీట్లు, ప్రసంగాలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిపై ఇలా బహిరంగంగా స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల అది ప్రత్యర్థులకు అవకాశంగా మారుతుందని అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆయన బీజేపీలో కొనసాగారు. తనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్‌లోకి వచ్చానని, కానీ ప్రస్తుతం హామీ నెరవేర్చడంలేదంటూ ఆయన తన అసహనాన్ని సీఎంపై వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
రాజకీయ, కుటుంబ సమీకరణాలే కారణమా?
నల్గొండ జిల్లాలోని రాజకీయ, సామాజిక, కుటుంబ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తుండగా.. ఒకే జిల్లాలో అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని మిగతా నేతల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒక్కరికే మంత్రి పదవి అని అధిష్టానం నుంచి మునుగోడు ఎమ్మెల్యేకు స్పష్టమైన సంకేతాలు అందాయని, దీంతో మరింత ఫ్రస్టేషన్‌తో రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రాకపోయినా మునుగోడు ప్రజలే ముఖ్యం అంటూ పరోక్షంగా మంత్రి పదవిపై ఆయనకున్న మక్కువను బయటపెడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
మంత్రి పదవి రానందునే..
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి రాదని స్పష్టమైన సంకేతాలు రావడం వల్లే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతున్నది. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీ పెద్దలు, పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలని నేతలు సూచిస్తున్నారు. అంతేకానీ పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా, పిలిచి మాట్లాడకుండా పార్టీ ఎందుకు ఉపేక్షిస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే వదిలేస్తే ఆయనలాగే మరికొందరు మాట్లాడే ప్రమాదముందని సూచిస్తున్నారు.
సీఎంకు వ్యతిరేకంగా..
పదేండ్లు తానే సీఎం అని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్‌పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ట్వీట్ చేశారు. తాజాగా సోషల్‌మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ చేసిన ప్రసంగాన్ని సైతం మునుగోడు ఎమ్మెల్యే తప్పబట్టారు. ఉత్తమ కుమార్‌రెడ్డి భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. మంగళవారం రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగం మరో వివాదానికి తెరలేపింది. ‘అవసరమైతే మరోసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ప్రభుత్వాన్ని మరోసారి ప్రజల కాళ్ల ముందుకు తీసుకువస్తానని’ ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆయన బీజేపీలో చేరకముందు కేసీఆర్‌ను ఎదుర్కొలేకపోతున్నారంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలోనూ పీసీసీ అధ్యక్షుడి పదవిని తనకు లేదా తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఇవ్వడంపైనా తన అక్కసును వెళ్లగక్కారు. చివరికి పార్టీ మారి బీజేపీలో చేరిన ఉపఎన్నికలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.






