2022 నాటి కేసులో రాజాసింగ్ నిర్దోషిగా విడుదల: MIM, BRSలపై సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

2022 నాటి వివాదాస్పద కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్దోషిగా విడుదలయ్యారు.

2022 నాటి కేసులో రాజాసింగ్ నిర్దోషిగా విడుదల: MIM, BRSలపై సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసులు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి తలొగ్గి తనపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆరోపించారు. మతాధినేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఇవాళ ఆయన నాంపల్లి కోర్టు (Nampally Court) నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు. కేసులో తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఐఎం (AIMIM) పార్టీ చెప్పిన విధంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని ఫైర్ అయ్యారు. 2022లో ఎవరో దేవుడిపై తాను వ్యాఖ్యలు చేశానంటూ తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని అన్నారు. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసులు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లొంగిపోయి తనపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించారని ధ్వజమెత్తారు. దాదాపు 77 రోజుల పాటు తనను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం కథను పూర్తిగా మార్చేసి, వేర్వేరు పోలీస్ స్టేషన్లలో తనపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేయించిందని రాజాసింగ్ మండిపడ్డారు.

చివరకు న్యాయమే గెలిచింది..

ఎవరు తనపై ఎన్ని కుట్రలు చేసినా.. చివరకు న్యాయమే గెలిచిందని రాజాసింగ్ అన్నారు. మొదటి నుంచి ఒకటే చెబుతున్నా.. ఎవరి మతపరమైన భావాలు, దేవుళ్లను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని.. అది ఈరోజు నిజమైందన్నారు. నాటి కేసులో కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునివ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తనపై పలు తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. అయితే, గత కేసుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో నమోదైన ప్రతి తప్పుడు కేసు నుంచి కూడా తాను నిర్దోషిగా బయటకు వస్తాననే నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story