రాష్ట్రంలో వర్షాలు.. ఆర్ అండ్ బీ శాఖ అలర్ట్.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

వర్షపాతం తీవ్రతను బట్టి 'కలర్ కోడ్' హెచ్చరికలు జారీ చేయబోతున్నామని రోడ్లు దెబ్బతింటే 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

రాష్ట్రంలో వర్షాలు..  ఆర్ అండ్ బీ శాఖ  అలర్ట్.. మంత్రి కోమటిరెడ్డి కీలక  ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారి రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రజల ప్రాణ భద్రతను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వరదలు, భారీ వర్షాల వల్ల రోడ్లు, వంతెనలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు ఆర్&బీ శాఖ ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మార్గదర్శకాలను విడుదల చేసినట్లు సోమవారం మంత్రి వెల్లడించారు. ఆర్&బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జారీ చేసిన ఈ గైడ్‌లైన్స్ ప్రకారం జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయం:

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, ఎక్స్కవేటర్లు, టిప్పర్లు, డీ-వాటరింగ్ పంపులు, ఇసుక సంచులు, కంకర, తారు, ఆర్‌సీసీ సామగ్రి, హెచ్‌డీపీఈ పైపులు తదితర అవసరమైన పరికరాలు, సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు ప్రమాదం ఉన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు, కట్టల బలహీన ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రతి ప్రమాదకర ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), తెలంగాణ డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ పోర్టల్, తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

నష్టం జరిగిన 24 గంటల్లోపు నివేదికలు:

భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు దెబ్బతిన్న వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని, వరద నీరు తగ్గిన వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. నష్టం జరిగిన 24 గంటల్లోపు ఫోటోలు, జీపీఎస్ వివరాలతో నష్టం అంచనా నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన అత్యవసర పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఇంజినీర్లకు అప్పగించిన అధికారాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా చేపట్టే పునరుద్ధరణ పనుల వ్యయాన్ని ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఎంఎఫ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు.

కలర్ కోడ్‍లు:

వర్షపాతం తీవ్రతను బట్టి రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్,ఎల్లో,ఆరెంజ్, రెడ్ కలర్-కోడ్ ఆధారిత హెచ్చరిక వ్యవస్థను అమలు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైతే గ్రీన్ అలర్ట్ కింద సాధారణ పర్యవేక్షణ కొనసాగిస్తూ యంత్రాలు, సామగ్రి సిద్ధంగా ఉన్నాయో లేదో నిర్ధారించాలని సూచించారు. 64.5 నుంచి 115 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే యెల్లో అలర్ట్ పరిస్థితుల్లో సున్నితమైన ప్రాంతాలను సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (AEEలు) ప్రత్యక్షంగా సందర్శించి, కాంట్రాక్టర్లు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 115 నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే ఆరెంజ్ అలర్ట్ సమయంలో AEEలు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండగా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEలు) ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. 204 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే రెడ్ అలర్ట్ పరిస్థితుల్లో AEలు, AEEలు,EE లు 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలను సమన్వయం చేయాలని, పరిస్థితులపై వెంటనే సూపరింటెండింగ్ ఇంజినీర్‌ (SE)కు,ఆపై సి.ఈ లకు సమాచారం అందించాలని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సెంటర్ కు ఈ వర్షాకాలంలో రోజువారీ పరిస్థితుల నివేదికలు తప్పనిసరిగా సమర్పించాలని, నష్టం జరగకపోయినా ‘నిల్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశించారు.

నో లీవ్స్:

ఫీల్డ్ సిబ్బందికి ప్రత్యేక అనుమతి లేకుండా సెలవులు మంజూరు చేయరాదని ఉన్నతాధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారి రవాణా వ్యవస్థను కొనసాగించడం, వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఈ ఎస్‌ఓపీ(SOP) ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story