Rains: రోడ్లన్నీ జలమయం.. రాష్ట్రంలో 6 రోజుల పాటు వర్షాలు

by Ramesh Naini |

ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rains: రోడ్లన్నీ జలమయం.. రాష్ట్రంలో 6 రోజుల పాటు వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Rains) ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌‌తో పాటు పలు జిల్లాల్లో గురువారం వేకువ జామున కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లిలో వర్షపు నీటితో బస్టాండ్‌లో వర్షపు నీరు నిలవడంతో ఇవాళ ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొల్లాపూర్ డివిజన్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. 164.6 ఎంఎం వర్ష పాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో కేవలం గంట సేపట్లో 114.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు ప్రకటించారు. భారీ వర్షం నేపథ్యంలో మజీద్ బండ, డోయెన్స్ కాలనీ ప్రాంతాల నుండి గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే దారులు నీట మునిగాయి. ఆ ప్రాంతాల గుండా వెళ్లేవారు మరోదారిలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. సరూర్​నగర్​, చైతన్యపురి, కొత్తపేట, దిల్​సుఖ్​నగర్​, మూసారాంబాగ్​, చాదర్​ఘాట్​, మలక్​పేట్​, సంతోష్​నగర్, సైదాబాద్​, కర్మన్​ఘాట్​, చంపాపేట ప్రాంతాల్లో నేటి ఉదయం వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నేటి నుంచే పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక జీహెచ్​ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఆరు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్లు సూచించింది. ఇవాళ జగిత్యాల, ఆదిలాబాద్​, కొమురం భీం ఆసిఫాబాద్​, సంగారెడ్డి, మహబూబాబాద్​, వికారాబాద్​, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

నిజామాబాద్​, మహబూబాబాద్​, వనపర్తి, నాగర్​కర్నూల్​, నిర్మల్​, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి కుమురం భీం ఆసిఫాబాద్​, ఆదిలాబాద్​, జగిత్యాల, నిజామాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, వరంగల్​, మహబూబాబాద్​, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్​, జనగాం, హనుమకొండ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Next Story