ఆదాయంపై రైల్వే శాఖ నజర్.. లగ్జరీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు రెట్టింపు

by Kema Shiva Kumar |

రైల్వే శాఖ తన ఆదాయం పెంచుకోవడానికి లగ్జరీ రైళ్లపై దృష్టి పెడుతోంది.

ఆదాయంపై రైల్వే శాఖ నజర్.. లగ్జరీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు రెట్టింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే శాఖ తన ఆదాయం పెంచుకోవడానికి లగ్జరీ రైళ్లపై దృష్టి పెడుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2019-20 నుండి 2024-25 మధ్యకాలంలో సూపర్ ఫాస్ట్ లగ్జరీ రైళ్లు రెట్టింపు కాగా ప్యాసింజర్ రైళ్లు మాత్రం దాదాపు సగానికి సగం తగ్గిపోయాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రం కొద్ది శాతం పెరిగాయి. దక్షిణ మధ్య రైల్వేలో 2019-20 లో సూపర్ ఫాస్ట్ లగ్జరీ రైళ్లు 5897 నడవగా 2024-25 నాటికి 10,443 కి పెరిగాయి. ప్యాసింజర్ రైళ్లు ఇదే కాలంలో 99,795 నుండి 63,465 కు తగ్గిపోయాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లు 94,090 నుండి 1,09,863 కు పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైలు తగ్గిపోయాయి. విలాసవంతమైన సౌకర్యాలతో వేగంగా ప్రయాణించే వందే భారత్ , శతాబ్ది, దురంతో, రాజధాని, మహారాజా, హమ్ సఫర్, గోల్డెన్ చారియట్ తదితర సూపర్ ఫాస్ట్ ప్రీమియం రైళ్లు గణనీయంగా పెరిగాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లలో కూడా జనరల్ కంపార్ట్ మెంట్లు తగ్గిపోయాయి, ఏసీ కోచ్ లు పెరిగాయి. ఇటీవల నగరంలోని అంబర్పేటకు చెందిన ఒక వ్యక్తి రైళ్ల వివరాలు ఇవ్వాలని కోరడంతో తాజాగా రైళ్ల వివరాలు రైల్వే శాఖ వెల్లడించింది.

ప్యాసింజర్ రైళ్లు తగ్గడంలో ‘ప్రైవేటు’ దిక్కు

కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకునేందుకు సామాన్యులు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లు తగ్గించడంతో లగ్జరీ రైళ్లలో వెళ్లలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మోడీ సర్కార్ ఆదాయం కోసం ధరలు కొద్దిగా పెంచిన పెద్దగా ఇబ్బందులు ఉండవని, రైళ్లను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు దూరం వెళ్లాలంటే రైలు ప్రయాణాలు తరుచుగా చేస్తారు. గత ఐదేళ్ల నుంచి రైళ్లను తగ్గించడంతో సొంత వాహనాలు, ప్రైవేటు సర్వీసులపై గమ్యకస్థానాలకు చేరుకునే పరిస్థితి వచ్చింది. పలుమార్లు రైళ్లను పెంచాలని కార్మిక సంఘాల నేతలు కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుణ్య క్షేత్రాలకు తరుచుగా వెళ్లే వారు ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. రైలు ప్రయాణాలపై దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఆధార పడుతారు.

భారతదేశంలోని 7 ఉత్తమ లగ్జరీ రైళ్లు : మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్, దక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్, ఫెయిరీ క్వీన్ ఎక్సెప్రెస్, హెరిటెజ్ ఆన్ వీల్స్ రైళ్లు సంపన్నులకు సేవలందిస్తున్నాయి.

Next Story