డోర్నకల్ రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు.. గోల్కొండ, కోణార్క్, కృష్ణా ఎక్స్‌‌ప్రెస్‌లు నిలిపివేత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-29 07:11:27  IST  )

ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీన పడుతున్న మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

డోర్నకల్ రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు.. గోల్కొండ, కోణార్క్, కృష్ణా ఎక్స్‌‌ప్రెస్‌లు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్/మరిపెడ/డోర్నకల్:: ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీన పడుతున్న మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వర్షపునీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మొంథా తూఫాన్ కారణంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో వరద నీరు భారీగా రైల్వే స్టేషన్ లోకి వచ్చి చేరుతోంది. అయితే మహబూబాబాద్, గార్ల, గుండ్రాతి మడుగు, డోర్నకల్ జంక్షన్ లలో రైల్వే ట్రాక్ నీటిలో మునిగిపోవటంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను జిల్లా పరిధిలోనే నిలిపివేశారు. డోర్నకల్ రైల్వే జంక్షన్ పూర్తిగా జలమయమవగా ఒకటో నెం ఫ్లాట్ ఫాం పైకి నీరు చేరింది. సుమారు రెండు గంటల క్రితం గోల్కొండ ఎక్స్ ప్రెస్, ఓ గూడ్స్ రైళ్లను డోర్నకల్ జంక్షన్ లోనే నిలిపి వేశారు. అదే విధంగా గుండ్రాతి మడుగులో కోణార్క్ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్ ప్రెస్, గార్ల సమీపంలో గూడ్స్ రైలును కూడా నిలిపివేశారు.

వర్షం తగ్గుముఖం పట్టే పరిస్థితి లేకపోవడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే గోల్కొండ రైలులో సుమారు 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డోర్నకల్ జంక్షన్‌లో కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని రోడ్డు మార్గం ద్వారా వెళ్తుండగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కూడా ఖమ్మం జిల్లా పరిధిలోనే నిలిపి వేయనున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే రైళ్ల రాకపోకలు ఆలస్యం కానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలీసులు ప్రయాణికులకు బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు.

Next Story