- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Reservations: జాగృతి రైల్ రోకో నిరవధిక వాయిదా.. సర్కార్ కు వారం గడువు
బీసీ ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తాము తలపెట్టిన రైల్ రోకో వాయిదా వేస్తున్నట్లు కవిత ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విజయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆర్టినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను (BC Ordinance) ఆమోదించకుండా గవర్నర్ ఆపితే మళ్లీ రైల్ రోకో తప్పదని హెచ్చరించారు. బీజేపేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నమెంట్ కు గవర్నర్లకు మధ్య పంచాయితీలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ఆర్డినెన్సులు, బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్తకాదని మళ్లీ ఉద్యమం చేస్తామని రైళ్లు, బస్సులను స్తంభింపచేస్తామన్నారు. ఆర్డినెన్స్ రూపంలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత అన్నారు. ఆర్డినెన్సు రూపంలోనే రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే 18 నెలల పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఎందుకు ఆగాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాము తీసుకువచ్చిన బిల్లు ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయనే రాజకీయ లబ్ది కోసమే ఇంతకాలం ప్రభుత్వం ఆగిందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వారం రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను ఓ కంట కనిపెడుతూనే ఉంటామన్నారు.
మరి రెండో బిల్లు సంగతేంటి?
తెలంగాణ జాగృతి పోరాటం వల్లే బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ రెండు బిల్లులను తీసుకువచ్చిందని కవిత అన్నారు. అయితే నిన్న కేబినెట్ మాత్రం కేవలం రాజకీయాలకు సంబంధించిన బిల్లుపైనే మాట్లాడిందని మరి విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు సంగతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. బీసీలుకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ బిల్లు కోసం ఆర్డినెన్స్ ఇచ్చి, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు కేంద్రం నుంచి వచ్చాక అమలు చేస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యా ఉద్యోగాలు, పెన్షన్లు, మహిళలకు రూ. 2500 వంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల జనాభాలో ఎక్కువ భాగం ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా ప్రతిరోజు రాజకీయాల చుట్టే డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ తలచుకుంటే నిమిషం పని:
బీజేపీ తలుచుకుంటే ఒకే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని కవిత అన్నారు. కానీ వారికి స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఆ పని చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంలో తప్పంతా కాంగ్రెస్ పై తోసేసి బీజేపీ తప్పించుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారని వీరిలో ఒకరు బీసీ బిడ్డ ఉన్నారన్నారు. బీసీ బిడ్డ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ బిల్లు ఆమోదం పొంది శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలన్నారు.






