ACB: కాళేశ్వరం నిధులు కొడుకు కంపెనీకి!.. బయటకు వస్తున్న మురళీధర్ రావు లీలలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-15 07:41:56  IST  )

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

ACB: కాళేశ్వరం నిధులు కొడుకు కంపెనీకి!.. బయటకు వస్తున్న మురళీధర్ రావు లీలలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు (Muralidhar Rao) ఇంట్లో ఏసీబీ (ACB Raids) నిర్వహిస్తున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు.. ఆ సమయంలో పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నిధులను తన కుమారుడు అభిషేక్ రావుకు చెందిన సొంత కంపెనీల హర్ష కన్ స్ట్రక్షన్ కు మళ్లించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు పాలమూరులోను భారీగా సబ్ కాంట్రాక్ట్ లు చేశారని, తన కుమారుడు అభిషేక్ బినామీలకు లబ్ధి చేకూరేలా మురళీధర్ రావు వ్యవహరించినట్లు సమాచారం. వర్క్ ఆర్డర్స్ జారీలోనూ మురళీధర్ రావు అకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొనసాగుతున్న తనిఖీలు..

జూబ్లీహిల్స్ లోని మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు తన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన హర్ష కన్ స్ట్రక్షన్ పై కూడా రెయిడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ తో పాటు మొత్తం పది చోట్ల మరళీధర్ రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈఎన్సీ జనరల్ గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత మురళీధర్ రావు పదవీకాలాన్నీ 13 ఏళ్ల పాటు ప్రభుత్వం పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆయనే కొంత కాలం పదవిలో కొనసాగినా ఆ తర్వాత ఆయనపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తొలగించింది.

వరుసగా ఏసీబీ వలలో కాళేశ్వరం ఇంజినీర్లు:

ప్రభుత్వం ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై దృష్టి సారించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో వరుసగా కాళేశ్వంలో కీల పాత్ర పోషించిన ఇంజినీర్లపై ఏసీబీ రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. గత ఏప్రిలో కాళేశ్వరం ఈఎన్ సీ భూక్యా హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు. ఈ సోదాల్లో అతడి వద్ద కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హరిరామ్ కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఏపీల రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉన్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో విల్లాలు, ఫ్లాట్లు, ఇళ్లు, స్థాలలు పోగేసుకున్నట్లు గుర్తించారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరిరామ్ ఆధ్వర్యంలో రూ. 48,665 కోట్ల మేర కాళేశ్వరం పనులు జరిగాయి. ఇక ఇవాళ కాళేశ్వరం అత్యంత కీలకంగా వ్యవహరించి మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు సైతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కావడం, ప్రజాధనాన్ని తన సొంత కొడుకు కంపెనీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఈ అధికారుల తీగ లాగితే డొంక ఎక్కడ కదలబోతున్నది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నది. వీరి వెనుక ఉన్నది ఎవరు? అనేది విచారణలో బయటకు రావాల్సి ఉంది.

Next Story