‘రేటింగ్ కాదు.. హక్కులు కావాలి’ కర్ణాటక తర్వాత తెలంగాణలోనే.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

భారత్ జోడో యాత్ర సమయంలో గిగ్ వర్కర్లు చెప్పిన ఈ మాటలు తన మనసులో నిలిచిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తుకుచేశారు.

‘రేటింగ్ కాదు.. హక్కులు కావాలి’ కర్ణాటక తర్వాత తెలంగాణలోనే.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రేటింగ్ కాదు.. హక్కు కావాలి.. మేము మనుషులమే.. బానిసలం కాదు’ అని భారత్ జోడో యాత్ర సమయంలో (gig workers) గిగ్ వర్కర్లు చెప్పిన ఈ మాటలు తన మనసులో నిలిచిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తుకుచేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటకలోని తమ (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు హక్కులు, గౌరవం, రక్షణకు హామీ ఇచ్చే ఆర్డినెన్స్ జారీ చేసి చారిత్రాత్మక అడుగు వేసిందని పేర్కొన్నారు.

ఎండ వేడిమి, చలి, వర్షాన్ని తట్టుకోని గిగ్ కార్మికులు మనకు ఆహారం తెస్తారని, నిత్యావసరాలను సురక్షితంగా తీసుకొస్తారని తెలిపారు. అయితే వారు తరచుగా వివరణ లేకుండా యాప్‌ల నుంచి బ్లాక్ చేయబడతారని, అనారోగ్య సెలవులు సైతం ఉండవని, వారికి వచ్చే డబ్బులు పారదర్శకత లేని అల్గోరిథం ప్రకారం చెల్లిస్తారని వెల్లడించారు. దాన్ని తాము మారుస్తున్నట్లు తెలిపారు. సామాజిక భద్రత, న్యాయమైన ఒప్పందాలు, అల్గోరిథమిక్ చెల్లింపులో పారదర్శకత, ఏకపక్ష బ్లాక్‌కి ముగింపు వంటివి కర్ణాటక కొత్త ఆర్డినెన్స్ నిర్ధారిస్తోందన్నారు.

టెక్నాలజీ ప్రజలకు ఈ విధంగా సేవ చేయాలని అందులో భాగంగా రాజస్థాన్, కర్ణాటక మార్గం చూపించిందని, తర్వాతి స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్ పని కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, పని సంబంధాలను పునర్నిర్మిస్తోందన్నారు. కార్మికుల హక్కులకు కేంద్రంగా ఇవి ఉన్నాయని, మేము దీనిని ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Next Story