Raghunandan Rao: ఊరందరికి శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు కేసీఆర్ పరిస్థితి: రఘునందన్ రావు

by Prasad Jukanti |   (  Updated:2026-01-01 11:54:31  IST  )

కేటీఆర్ ఫ్యూచర్ పై రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raghunandan Rao: ఊరందరికి శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు కేసీఆర్ పరిస్థితి: రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఊరందరికి శకునం చెప్పే బల్లి పోయి కుడితిలో పడ్డట్టు కేసీఆర్ (KCR) ప్రస్తుత పరిస్థితి ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు ఊరందరి పంచాయతీలు తెంపిన కేసీఆర్ ఇప్పుడు కుటుంబంలో కొడుకు కూతురు, అల్లుడు బిడ్డ మధ్య పంచాయతీ తెంపలేకపోతున్నాడని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘునందన్ రావు.. త్వరలో బీఆర్ఎస్ ఫేడ్ అవుట్ కావడం ఖాయం అన్నారు. కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయం అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి లేచి నిలబడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలన్నారు. ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ ఆశపడుతున్నా ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ, ఆయన క్యాడర్, కుటుంబ సభ్యులు సహకరించడం లేదని అభిప్రాయపడ్డారు. హరీశ్ రావు ప్రస్తుతం మౌనంగా ఉండి జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతోందని ఈ విషయంలో బాండ్ రాసి ఇవ్వగలనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న మోడీ, అమిత్ షా వ్యాఖ్యల్లో నూటికి నూరుశాతం జరుగుతుందన్నారు.

బండి వర్సెస్ ఈటల ఇష్యూపై..

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య వర్గపోరు పార్టీని డ్యామేజ్ చేస్తోందన్న అభిప్రాయంపై స్పందించిన రఘునందన్ రావు.. నాలుగు గోడల మధ్య నేతలు తమ తమ అభిప్రాయాలు చెబుతారని అయితే అంతిమంగా అధ్యక్షుడితే తుది నిర్ణయం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు అయ్యాక ఎవరూ విభేదించలేదన్నారు. ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా లేదన్నట్లు మా పార్టీలో విభేదాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేస్తోందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంశంపై స్పందించారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికలను బట్టుకుని ఆయన క్యాండిడేట్ ఈయన క్యాండిడేట్ అని మాట్లాడటం ఏమిటన్నారు. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పొత్తు, పొంతన పెట్టకూడదన్నారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ వేరు ఇప్పుడున్న తెలంగాణ వేరు అని పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూశాక ప్రజలు బీజేపీ వైపు ఆసక్తి చూపుతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Next Story