కవిత డ్రామాకు కారణం ఇదే.. కుండబద్దలు కొట్టిన రఘునందన్ రావు

by Gantepaka Srikanth |

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుల్వకుంట్ల కుటుంబంపై బీజేపీ(BJP) ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత డ్రామాకు కారణం ఇదే.. కుండబద్దలు కొట్టిన రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుల్వకుంట్ల కుటుంబంపై బీజేపీ(BJP) ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్(KCR) కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అతి దారుణంగా అవమానించారని గుర్తుచేశారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చారని అన్నారు. మళ్లీ కేసీఆర్ కుటుంబం రీ బాండింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.. రాష్ట్రంలో అన్నా చెళ్లెల్ల గురించే చర్చ జరగాలని ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని.. అందుకే ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారని తెలిపారు. కవిత చెల్లని రూపాయి అని తీవ్ర విమర్శలు చేశారు.

కవిత, కేటీఆర్‌(KTR)కు ఇద్దరికీ బ్రాండ్‌ లేదని అన్నారు. నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చేయలేదనే ఎంపీగా ఓడించారని వెల్లడించారు. కవిత జాగృతి పెట్టకముందు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకోలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని.. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని గెలిచే పార్టీ బీఆర్ఎస్సే అన్నారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. పొత్తులు విలీనాలపై తమ పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం అని మండిపడ్డారు. చిట్‌చాట్‌లు చేయడం కాదు.. కవితకు దమ్ము ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలని హితవు పలికారు.

Next Story