- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ర్యాగింగ్ రక్కసి.. సీనియర్లైతే అంత అహంకారమా?
ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యార్థులు దారితప్పుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/కార్వాన్: ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యార్థులు దారితప్పుతున్నారు. సీనియారిటీ అనే అహంకారంతో జూనియర్ల పాలిట రాక్షసులుగా మారుతున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం.
మెడికల్ కాలేజీల్లోనే ఈ వ్యాధి ఎక్కువ
పిల్లలను ఉన్నత విద్యాసంస్థల్లో చేర్పించి, వారిని ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు కలలు కంటారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి పంపిస్తే, అక్కడి క్యాంపస్ కలుషిత వాతావరణం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. సొసైటీ ఎగైనెస్ట్ వయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24 నివేదిక దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. గడిచిన రెండేళ్ల వ్యవధిలో (2022 నుంచి 2024 మధ్య) దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ కారణంగా ఏకంగా 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1,900కు పైగా కళాశాలల నుంచి యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు 3,000కు పైగా ఫిర్యాదులు అందగా.. అందులో అత్యధికంగా 38.6 శాతం కేవలం మెడికల్ కాలేజీల నుంచే రావడం గమనార్హం.
కలచివేస్తున్న గత స్మృతులు.. శ్రీవిద్య ఉదంతం
ఇటీవలే వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీవిద్య అనే విద్యార్థిని సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. పద్మాక్షి హాస్టల్‌లో గౌరవం ఇవ్వడం లేదన్న చిన్న నెపంతో సీనియర్లు ఆమెను టెర్రస్ పైకి తీసుకెళ్లి ఎయిర్ చైర్ శిక్షలు వేశారు. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని ఎలుకల మందు తాగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఏడుగురు తృతీయ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.
నిబంధనలు గాలికి..
ర్యాగింగ్ అనేది చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి పాల్పడిన వారికి సస్పెన్షన్, అడ్మిషన్ రద్దు, డీబార్‌తో పాటు జైలు శిక్షలు విధించే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, విద్యార్థి సంఘాలు ఉండటం వల్ల ఈ సమస్య కొంత మేర బయటకు వస్తోంది. కానీ, కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో కళాశాల పరువు పోతుందన్న నెపంతో యాజమాన్యాలు ఇలాంటి ఘటనలను బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులనే కాదు, ఫైనల్ ఇయర్ వచ్చే వరకూ ఏదో ఒక దశలో విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతూనే ఉన్నారు.
ఉమ్మడి కృషితోనే అడ్డుకట్ట
విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను కట్టడి చేసేందుకు జాతీయ విద్యా మండలి ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. విద్యార్థులు నిర్భయంగా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. అయితే, కేవలం కఠిన చట్టాలు ఉంటేనే ఈ రక్కసిని అరికట్టలేం. ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు కాగితాలకే పరిమితం కాకుండ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు క్యాంపస్‌లో స్పష్టంగా ప్రదర్శించాలి. హాస్టళ్లలో రాత్రివేళల్లో కఠిన పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా పెంచాలి. రెండు, మూడు నెలలకోసారి కౌన్సెలింగ్ సెషన్లు, సైకలాజికల్ సపోర్ట్ కార్యక్రమాలు నిర్వహించాలి. అన్నింటికీ మించి సీనియర్లు జూనియర్లను తమ తమ్ముళ్లు, చెల్లెళ్లుగా భావించేలా వారి ప్రవర్తనలో, ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధ్యాపకులు, తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది.
ఉస్మానియాలో 12 మందిపై వేటు
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జూనియర్ విద్యార్థులను ఫైనల్ ఇయర్‌కు చెందిన సీనియర్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలు నిజమని తేలడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. బాధితుల ఫిర్యాదుతో కాలేజ్ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌కు పాల్పడిన ఈ 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేసింది.






