​కొల్లు చెరువు ఆక్రమణను అడ్డుకున్న సొసైటీ సభ్యులు

by Kodari Anjali |

భూగర్భ జలాలకు, స్థానిక అవసరాలకు ఆధారంగా ఉన్న చారిత్రాత్మక కొల్లు చెరువు ఆక్రమణదారుల చేతిలో రోజురోజుకూ కుంచించుకుపోతోంది.

​కొల్లు చెరువు ఆక్రమణను అడ్డుకున్న సొసైటీ సభ్యులు
X

దిశ, ​బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో భూగర్భ జలాలకు,స్థానిక అవసరాలకు ఆధారంగా ఉన్న చారిత్రాత్మక కొల్లు చెరువు ఆక్రమణదారుల చేతిలో రోజురోజుకూ కుంచించుకుపోతోంది. ఇప్పటికే ఈ చెరువుకు సంబంధించిన సుమారు 10 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​ ఈ నేపథ్యంలో, బుధవారం రాత్రి కొందరు అక్రమార్కులు చెరువును పూడ్చివేసి, ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలనే కుట్రతో లారీలతో భారీగా మట్టిని తరలించారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా చెరువు గర్భంలో మట్టిని కుమ్మరించి పూడ్చివేసే పనులకు శ్రీకారం చుట్టారు.

ఇలాంటి అక్రమాలను సహించేది లేదు..

రాత్రి వేళ లారీలతో అక్రమంగా మట్టి తరలించి చెరువును పూడ్చుతున్న విషయం తెలుసుకున్న స్థానిక సొసైటీ సభ్యులు తక్షణమే స్పందించారు. గురువారం ఉదయం వారు ఆక్రమణ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లారీలతో పోసిన మట్టి కుప్పలను పరిశీలించి, అక్రమ పనులను అక్కడికక్కడే అడ్డుకున్నారు. ​ప్రకృతి వనరులను, చెరువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి అక్రమాలను సహించేది లేదని సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ భారీ ఆక్రమణ యత్నంపై ఉన్నతాధికారులకు సంబంధిత శాఖలకు పూర్తి ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. చెరువులను రక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ పూడ్చివేతకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story