విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై సస్పెండ్..

by Kodari Anjali |

పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు, ఫిర్యాదులు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై సస్పెన్షన్‌కు గురయ్యారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై సస్పెండ్..
X

దిశ, సూర్యాపేట(అర్వపల్లి): సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ఈట సైదులును విధుల్లో నిర్లక్ష్యం, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు, ఫిర్యాదులు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఈ మేరకు మల్టీజోన్-2 ఐజీ షానవాజ్ ఖాసిం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డుల నిర్వహణలో పలు లోపాలు గుర్తించడంతో పాటు, బాధితులు ఫిర్యాదులతో వచ్చినప్పటికీ కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సై సైదులు విధుల్లో చేరిన నాటి నుంచి ఆయనపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక పంపగా, దానిని పరిశీలించిన మల్టీజోన్-2 ఐజీ ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే, సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story