పేదల సొంతింటి కలపై అధికార గద్దల ‘లంచాల’ వేట..

by Kodari Anjali |

పేదల సొంతింటి కల కొంతమందికి కలలాగే మిగిలిపోతుంది.

పేదల సొంతింటి కలపై అధికార గద్దల ‘లంచాల’ వేట..
X

దిశ, (వెంకటాపూర్,రామప్ప): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న నిరుపేదకు కూడా సొంతింటి నీడ కల్పించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ఇంచెంచెరుపల్లె గ్రామంలో కొందరు స్వార్ధపూరిత ప్రజాప్రతినిధుల పాలిట కామధేనువుగా, అసలైన పేదల పాలిట శాపంగా మారింది. పేదరికాన్ని నిర్మూలించాల్సిన పథకం, ఇక్కడ పేదవాడి రక్తాన్ని పిండేసే సాధనంగా రూపాంతరం చెందింది. ఓ ప్రజాప్రతినిధి బహిరంగంగానే "ఇల్లు కావాలంటే యాభై వేలు ముట్టజెప్పాల్సిందే" అంటూ లంచాల వేట సాగిస్తుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న పేదలు గుండెలు బాదుకుంటున్నారు. మరోవైపు, ఈ ఘోర అవినీతిపై బాధితులు తిరగబడి, ఆధారాలతో సహా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా, అధికారుల వైఖరి మాత్రం తాంబూలాలిచ్చాం తలలు గొరుక్కున్నాం అన్న చందంగా తయారైంది. ప్రజాసమస్యల పట్ల, అవినీతి అక్రమాల పట్ల అధికారుల మౌనం, వారి నిమ్మకు నీరెత్తినట్లు ఉండే స్పందన చూస్తుంటే, ఈ లంచాల భాగోతంలో వారి వాటాలు కూడా సక్రమంగానే అందుతున్నాయా? అనే బలమైన అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి.

లంచం ఇస్తేనే ఇల్లా.. ప్రజాప్రతినిధి నగ్న స్వరూపం

ఇంచెంచెరుపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి,అధికార బలంతో ఇళ్ల మంజూరు ప్రక్రియను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అర్హుల జాబితాను తయారు చేయాల్సింది పోయి, ఎవరు ఎంత ఇస్తారు? అనే గిరాకీల జాబితాను సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇంటికి రూ.50,000 లంచం ఇస్తేనే మీ ఫైలు ముందుకు కదులుతుంది. లేకపోతే మీ ఇల్లు జాబితా నుంచి మాయమవుతుంది. అని సదరు ప్రజాప్రతినిధి లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, రోజువారీ కూలీ పనులకు వెళ్లే పేద కుటుంబాలు అంత భారీ మొత్తంలో లంచం ఎక్కడ నుండి తెస్తారని కూడా ఆలోచించకుండా, మానవత్వాన్ని పూర్తిగా పక్కనబెట్టి వసూళ్ల పర్వానికి తెరలేపారు. లంచం డబ్బులు ఇచ్చిన వారి పేర్లనే అర్హుల జాబితాలోకి ఎక్కించడం, ఇవ్వలేని వారిని అర్హత ఉన్నా సరే పక్కనబెట్టడం ఇంచెంచెరుపల్లెలో నిత్యకృత్యంగా మారింది. భూస్వాములకే తొలి విడత ఇళ్లు గ్రామంలో జరిగిన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని పరిశీలిస్తే, అక్కడ జరిగిన అక్రమాలు ఎంతటి ఘోరమైనవో స్పష్టమవుతుంది.

న్యాయం జరుగుతుందని ఆశ..

గ్రామంలో ఎకరాల కొద్దీ భూములు, సొంతంగా పక్కా ఇళ్లు, పట్టణాలలో ఆస్తులు ఉన్న భూస్వాములకు,రాజకీయ నాయకుల అనుచరులకే మొదటి విడతలో ఇళ్లు కేటాయించారు. ఒకవైపు నిజమైన పేదలు వర్షానికి కారుతున్న గుడిసెలలో తలదాచుకుంటుంటే, మరోవైపు కోట్లు ఉన్న భూస్వాముల అకౌంట్లలోకి ప్రభుత్వ సొమ్ము వెళ్లడం ఈ వ్యవస్థ దౌర్భాగ్యానికి నిదర్శనం. రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం ఉన్నవారు ప్రజాప్రతినిధి అడిగినంత లంచం ఇచ్చుకోగలరు కాబట్టి, వారికే ఇళ్లు మంజూరయ్యాయి. కానీ, రూపాయి సంపాదన లేని అట్టడుగు వర్గాల ప్రజలు మాత్రం తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూసి, చివరకు మోసపోయారు. ఈ వివక్షను చూసి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో గుడిసెలు, చావు నీడలో నిరుపేదల బతుకులు గ్రామంలో నిరుపేద కుటుంబాలు పాత పెంకుటిళ్లలో, శిథిలావస్థకు చేరిన రేకుల షెడ్లలో, ఎప్పుడు కూలిపోతాయో తెలియని గుడిసెలలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. వర్షాకాలం వస్తే నరకప్రాయం, వాన పడితే చాలు,పైకప్పుల నుండి నీరు కారి ఇళ్లంతా బురదమయంగా మారుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులను పట్టుకుని రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి.

అధికారులలో చలనం లేదు.. స్పందన శూన్యం..

ఎండాకాలంలో సెగలు, రేకుల షెడ్లలో మండుతున్న ఎండలకు తట్టుకోలేక పేద ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. స్వంత ఇల్లు లేని వేదన, తమకంటూ ఒక సురక్షితమైన నీడ లేక, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలే తమను ఆదుకుంటాయని దశాబ్దాలుగా వీరంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులలో ఉన్న సముద్రాల వనజ, ఉప్పునూతుల సునీత, బండి నర్మమ్మ, లావుడ్యా కల్యాణి, బాదవత్ సరోజన, నూనావత్ మోహన్ దాస్ వంటి ఎందరో నిజమైన నిరుపేదలు రెండవ విడతలోనైనా తమకు ఇల్లు వస్తుందని ఆశపడుతున్నారు. కానీ, ఇక్కడ కూడా లంచాల రాక్షసి వీరి ఆశలను బుూడిద చేస్తోంది. అర్జీలు బుట్టదాఖలు అధికారులలో చలనం లేదు స్పందన శూన్యం ఈ దారుణమైన అన్యాయంపై, విలేజ్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ కామ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్థులు అంతా ఏకమై తిరగబడ్డారు.బాధితుల సంతకాలు, వివరాలతో కూడిన పూర్తి నివేదికను ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరియు స్థానిక వెంకటాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) గారికి స్వయంగా అందజేశారు. స్పష్టంగా కనిపిస్తున్నట్లు, ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు దానిపై కేవలం అని ఒక సాధారణ నోట్ రాసి చేతులు దులుపుకున్నారు.

అధికారులు సైతం ఈ అవినీతికి..

బాధితులంతా కార్యాలయం చుట్టూ చేరి ఆర్జి పెట్టుకుంటున్నా, అధికారుల ముఖాల్లో ఎలాంటి సీరియస్‌నెస్ కనిపించడం లేదు. ఫిర్యాదు ఇచ్చి రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లంచాలు డిమాండ్ చేస్తున్న ప్రజాప్రతినిధిపై కనీస విచారణ జరిపిన దాఖలాలు లేవు. అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. "సార్.. మా గుడిసెలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు, మాకు న్యాయం చేయండి"అని మొరపెట్టుకున్నా, అధికారులు కనీసం గ్రామాన్ని సందర్శించడానికి కూడా సమయం కేటాయించడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు సైతం ఈ అవినీతికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. గ్రామస్థుల డిమాండ్లు ప్రజా పోరాటానికి సిద్ధం అంటూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఇంచెంచెరుపల్లె గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 21 మందికి పైగా ఉన్న నిజమైన నిరుపేద అర్హుల జాబితాను (కామ అశోక్ గారి ఆధ్వర్యంలో) అధికారులకు సమర్పించారు.వారి ప్రధాన డిమాండ్లు ఇవే పారదర్శక గ్రామసభ రాజకీయ ప్రమేయం లేకుండా, లంచాల ప్రస్తావన లేకుండా, గ్రామంలో బహిరంగ గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి.

లంచం ఇస్తేనే ఇల్లు అనే దౌర్భాగ్యపు సంస్కృతికి..

ఇంటికి 50 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్న ఆ ప్రజాప్రతినిధిపై మరియు మొదటి విడతలో భూస్వాములకు ఇళ్లు ఎలా కేటాయించారో దానిపై సమగ్ర విచారణ జరిపించాలి. పేదలకే మొదటి ప్రాధాన్యత గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలి. వ్యవస్థ మారకపోతే కలెక్టరేట్ ముట్టడి తప్పదు. ఇంచెంచెరుపల్లె ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం, ప్రభుత్వ పాలనకు మరియు స్థానిక అధికారుల నిష్క్రియాపరత్వానికి పరాకాష్ట. లంచం ఇస్తేనే ఇల్లు అనే దౌర్భాగ్యపు సంస్కృతికి అధికారులు అడ్డుకట్ట వేయకపోతే, రాబోయే రోజుల్లో పేదల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి,స్థానిక అధికారుల అలసత్వాన్ని వీడి, ఇంచెంచెరుపల్లె గ్రామంలోని అసలైన పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో గ్రామం మొత్తం ఏకమై జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు. పేదవాడి కన్నీరు తుడవాల్సిన ప్రభుత్వ పథకం, అధికారుల, నాయకుల నిర్లక్ష్యంతో ఇలా అవినీతి కూపంగా మారడం అత్యంత విచారకరం.

Next Story