విద్యుత్ షాక్‌తో కూలి మృతి..!

by Kodari Anjali |   (  Updated:2026-06-18 05:51:16  IST  )

మానకొండూరు కేజీబీవీలో నిర్మాణ పనులు చేపడుతుండగా ఓ కూలీ కరెంట్ షాక్‌కు గురై మరణించాడు.

విద్యుత్ షాక్‌తో కూలి మృతి..!
X

దిశ, మానకొండూరు: అతనో నిరుపేద.. రెక్కాడితే గాని డొక్కాడన కుటుంబం. పొట్టకూటి కోసం వచ్చిన ఆ యువకుడిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాటేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్‌నగర్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) స్కూల్ & జూనియర్ కాలేజ్ నూతన భవన నిర్మాణ పనుల్లో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌కు గురై శ్రీకాంత్ (30) అనే కూలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ అశోక్ నగరానికి చెందిన పెద్దపల్లి శ్రీకాంత్ (30) అనే యువకుడు శ్రీనివాస్‌నగర్ లోని కేజీబీవీ కాలేజీ కొత్త భవన నిర్మాణ పనుల నిమిత్తం కూలి పనులకు వచ్చాడు. ఈ క్రమంలో భవన నిర్మాణంలో భాగంగా ఐరన్ రాడ్లను పైకి లేపుతుండగా, పక్కనే అత్యంత సమీపంలో ఉన్న 11 కేవీ (11 KV) హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు ఆ ఐరన్ రాడ్డు ప్రమాదవశాత్తు తగిలింది. దీంతో భారీస్థాయిలో విద్యుత్ షాక్ తగిలి శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే శాపం..

భవన నిర్మాణ ప్రాంతానికి అత్యంత సమీపంలో 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తున్నప్పటికీ, కాంట్రాక్టర్ ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, తోటి కూలీలు మండిపడుతున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, కూలీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఓ నిరుపేద కుటుంబానికి ఆధారమైన యువకుడు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..

విషయం తెలుసుకున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108 వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

న్యాయం చేయాలని డిమాండ్..

కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడ్డామని, మృతుని కుటుంబానికి కాంట్రాక్టర్, ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో వాహనం

Next Story