గ్యాస్ భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ముప్పే!!

by Kodari Anjali |

ఇంట్లో నిత్యం ఉపయోగించే వంటగ్యాస్ భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రాణాలు, ఆస్తులకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ముప్పే!!
X

దిశ, హస్తినాపురం: ఇంట్లో నిత్యం ఉపయోగించే వంటగ్యాస్ భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రాణాలు, ఆస్తులకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీలు, అగ్నిప్రమాదాలు, పేలుడు ఘటనల నేపథ్యంలో గ్యాస్ సంస్థలు వినియోగదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సివిల్ సప్లై శాఖ ఏఎస్‌వో అనుముల పుల్లయ్య, వనస్థలి గ్యాస్ ఏజెన్సీ డీలర్ మూర్తి మాట్లాడుతూ.. గ్యాస్ స్టవ్‌లు, రెగ్యులేటర్లు, రబ్బరు పైపులు, సిలిండర్ కనెక్షన్లు తదితర పరికరాల పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఐదేళ్లకోసారి ఈ తనిఖీలు నిర్వహించడం తప్పనిసరి ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలను సరిచేసేందుకు కేవలం రూ.100 సేవా రుసుము మాత్రమే వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమేనని అధికారులు తెలిపారు. బయటకు కనిపించని చిన్నపాటి లోపాలు, పాతబడిన పైపులు, సరిగా పనిచేయని రెగ్యులేటర్లు, సడలిన కనెక్షన్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పారు.

ఇన్సూరెన్స్ పొందాలంటే నిబంధనలు తప్పనిసరి

గ్యాస్ వినియోగదారులు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్న అంశం ఇన్సూరెన్స్ నిబంధనలేనని అధికారులు పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ ఏ పేరుతో, ఏ చిరునామాలో నమోదు అయి ఉందో అదే ఇంట్లో వినియోగించినప్పుడే ప్రమాద సమయంలో ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. ఒక ఇంటి పేరుతో ఉన్న కనెక్షన్‌ను మరో ఇంట్లో వినియోగిస్తే ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తించవని హెచ్చరించారు. అదేవిధంగా గ్యాస్ కంపెనీ అందించిన అధికారిక రెగ్యులేటర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రైవేట్ లేదా నాణ్యత లేని రెగ్యులేటర్ల వాడకం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమే కాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కూడా తిరస్కరించబడే అవకాశం ఉందన్నారు.

ఐఎస్‌ఐ మార్క్ ఉన్న పరికరాలకే ప్రాధాన్యం

గ్యాస్ స్టవ్‌లు, రబ్బరు పైపులు, ఇతర అనుబంధ పరికరాల కొనుగోలులో వినియోగదారులు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఐఎస్‌ఐ (ISI) మార్క్ కలిగిన పరికరాలను మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. నాణ్యత లేని చౌక రకం పైపులు, స్టవ్‌లు, కనెక్షన్ పరికరాలు గ్యాస్ లీకేజీలకు కారణమై ప్రాణనష్టాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదం

“మా ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి” అనే భావనతో చాలామంది భద్రతా తనిఖీలను నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కంటికి కనిపించని చిన్న లీకేజీలు, అరిగిపోయిన వాషర్లు, పాత పైపులు, లోపభూయిష్టమైన పరికరాలే పెద్ద అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. గతంలో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర నష్టాలను చవిచూశాయని గుర్తుచేశారు.

గ్యాస్ లీకేజీ అనుమానం వస్తే..

గ్యాస్ వాసన వచ్చిన వెంటనే స్టవ్‌ను ఆఫ్ చేసి రెగ్యులేటర్‌ను మూసివేయాలని సూచించారు. విద్యుత్ స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయకుండా జాగ్రత్తపడాలని, వెంటనే కిటికీలు, తలుపులు తెరిచి గాలి ప్రసరణ కల్పించాలని చెప్పారు. అవసరమైతే గ్యాస్ ఏజెన్సీకి లేదా అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజల సహకారం అవసరం

భద్రతా తనిఖీల కోసం వచ్చే గ్యాస్ కంపెనీల అధికారిక సిబ్బందిని గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత ఇంట్లోకి అనుమతించాలని అధికారులు కోరారు. ఈ తనిఖీలు ప్రజల భద్రత కోసమేనని, వాటికి సహకరించడం ద్వారా భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ప్రతి కుటుంబం బాధ్యత. చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారిస్తాయి. ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవాలంటే భద్రతా తనిఖీలు తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story