యూనిట్ మొత్తం ఓకే చేసిన ఆమెను హీరోయిన్‌గా నేను ఒప్పుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన విజయభాస్కర్

by Pulgam srinivas |

మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ పాత్ర కోసం యూనిట్ సోనాలి బింద్రేను సూచించినా విజయభాస్కర్ కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారు.

యూనిట్ మొత్తం ఓకే చేసిన ఆమెను హీరోయిన్‌గా నేను ఒప్పుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన విజయభాస్కర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన దర్శకుల్లో కె. విజయభాస్కర్ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్‌గా తెరకెక్కిన మల్లీశ్వరి చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, కత్రినా కైఫ్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయభాస్కర్, మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. "మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కథ ప్రకారం ఆమె యువరాణి కావడంతో, ప్రేక్షకులు ఆమెను చూడగానే నిజంగా ఒక యువరాణిని చూసిన అనుభూతి కలగాలి అనుకున్నాం. ఆ సమయంలో యూనిట్ సభ్యులందరూ సోనాలి బింద్రేను ఆ పాత్రకు ఎంపిక చేయాలని సూచించారు. ఆమె అందం, క్రమశిక్షణ కారణంగా ఆ పాత్రకు అద్భుతంగా సరిపోతుందని అందరూ భావించారు" అని తెలిపారు.

అయితే, అప్పటికే సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం కావడంతో, కొత్త ముఖాన్ని తీసుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు విజయభాస్కర్ చెప్పారు. "ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా, నిజమైన యువరాణిలా కనిపించే అమ్మాయిని ఎంపిక చేయాలనుకున్నాను. అనేక మందిని పరిశీలించిన తర్వాత చివరకు కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశాం" అని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ద్వారా కత్రినా కైఫ్ తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

Next Story