Krishnaiah: ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు - ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు.

Krishnaiah: ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు - ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) 72 గంటల నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య (R. Krishnaiah) సంపూర్ణ మద్దతు తెలిపారు. తాజాగా తెలంగాణ జాగృతి నేతలు ఆర్. కృష్ణయ్యను కలిశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తోందన్నారు. కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందన్నారు. దాదాపు 40 , 50 ఏళ్ల నుంచి బీసీల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తోందని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కవితను మనసారా అభినందిస్తున్నాను.. కవిత పట్టుదలతో దీక్ష చేస్తుంది.. ఆమె దీక్ష విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.. అని కృష్ణయ్య వ్యాఖ్యనించారు.

బీసీ రిజర్వేషన్ల అంశం ఆర్డినెన్స్‌పై ఇంతవరకు తెలంగాణ గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవలేదని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఇంతవరకు తీసుకోలేదన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానం అవలంబిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అధికారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగంలోని 243 డీ 6 ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా కొత్త, కొత్త డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాల పైన, బీజేపీ, ఇతర నాయకుల పైన బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి పని చేయాలన్నారు. గ్లోబల్స్ ప్రచారం, డైవర్ట్ పాలిటిక్స్ పక్కపెట్టి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై ఇతర పార్టీలపై బురద జల్లుతూ రేవంత్ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story