- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి : మంత్రి సీతక్క
ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృశ్య విద్యార్థినీ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసి నాణ్యమైన విద్యను, పౌష్టికాహారం అందించాలని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృశ్య విద్యార్థినీ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసి నాణ్యమైన విద్యను, పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం మంత్రి హైదరాబాద్ నుంచి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి పాఠశాల, వసతి గృహంలో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని విద్యాసంస్థల భవనాలు, తరగతి గదులు, వసతి గృహ గదులు, వంటశాలలు, భోజనశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ కోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
"నమస్కారం – మన సంస్కారం"
అధికారులు వసతి గృహాలు, పాఠశాలలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సామాజిక సేవా, సంస్కృతి, సంప్రదాయాలు, మంచి అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. "నమస్కారం – మన సంస్కారం" అనే భావనను విద్యార్థుల్లో పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల్లో వైద్య శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ రవి కుమార్, ఆర్డీవో కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






