పేట్ బషీరాబాద్ ‘యు.ఎల్.సి’ భూముల్లో లీగల్ ‘ట్విస్ట్’!

by Kodari Anjali |   (  Updated:2026-06-08 10:47:36  IST  )

పేట్ బషీరాబాద్ గ్రామం సర్వే నెంబర్ 48 లో గల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల వ్యవహారం మలుపులు తిరుగుతోంది.

పేట్ బషీరాబాద్ ‘యు.ఎల్.సి’ భూముల్లో లీగల్ ‘ట్విస్ట్’!
X

దిశ, పేట్ బషీరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని పేట్ బషీరాబాద్ గ్రామం సర్వే నెంబర్ 48 లో గల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సరిహద్దులు తేల్చాల్సిన రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో, వివాదాస్పద భూమి చుట్టూ ఇప్పుడు చట్టపరమైన వ్యూహ ప్రతివ్యూహాలు ముసురుకున్నాయి. ఒకవైపు నిగూఢంగా సాగిన ప్రభుత్వ భూముల విక్రయాలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం .. మరోవైపు పాత తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు వేసిన రివ్యూ పిటిషన‍్లు.. వెరసి ఈ గురువారం (జూన్ 11న) హైకోర్టులో జరగబోయే న్యాయవిచారణ అంశం ఇప్పుడు చర్చనీయాంసమైంది.

సర్వేనెంబర్ 48/1 ప్రభుత్వానిదా? 48/2 ప్రైవేట్ వ్యక్తులదా?

ఈ వివాదంలో అత్యంత కీలకమైన లీగల్ పాయింట్.. సర్వే నెంబర్ల విభజన వాటి సరిహద్దులు.. కోర్టు రికార్డుల ప్రకారం.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ 2023 మే 1న జారీ చేసిన ఫైనల్ ఆర్డర్ (ఫైల్ నెం. G1/5065/1976) ద్వారా ప్రైవేట్ వ్యక్తుల పూర్వీకురాలైన సరోజినీ బాయి దాఖలు చేసిన డిక్లరేషన్‌ను ఆమోదించారు. ఆ ఉత్తర్వుల ప్రకారం సర్వే నెంబర్ 48/2 లోని 7 ఎకరాల 32 గుంటల భూమిని "నాన్-సర్ప్లస్" (మిగులు భూమి లేని ఆస్తి) గా నిర్ధారిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా క్లియరెన్స్ ఇచ్చారు.

సర్వే నెంబర్ల ‘మాయాజాలం’!

కానీ, ఇక్కడే రెవెన్యూ అధికారులు పెద్ద లూప్‌హోల్‌ను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కోర్టులో వాదిస్తూ.. ప్రైవేట్ వ్యక్తులకు అడిషనల్ కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చింది సర్వే నెంబర్ 48/2 కి మాత్రమేనని, కానీ ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుని, రక్షణ బోర్డు ఏర్పాటు చేసిన మిగులు భూమి సర్వే నెంబర్ 48/1 లో ఉందని స్పష్టం చేశారు. ఈ రెండు సర్వే నెంబర్లు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులు తమ 48/2 భూమి సాకుతో.. ప్రభుత్వానికి చెందిన 48/1 (48/P) లోని 4856.20 చదరపు మీటర్ల (సుమారు 5807 గజాల) భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారా? అనే సరిహద్దుల వివాదమే ఈ మొత్తం రచ్చకు కేంద్ర బిందువుగా మారింది.

హైకోర్టు ఆదేశించిన ‘జాయింట్ సర్వే’ జరిగిందా? లేదా?

ఈ సర్వే నెంబర్ల గందరగోళాన్ని గమనించిన హైకోర్టు న్యాయమూర్తి 06 మార్చి 2025 నాటి తీర్పులో అత్యంత స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వివాదాస్పద స్థలం ఖచ్చితంగా ఎవరి పరిధిలోకి వస్తుందో తేల్చడానికి.. సర్వే నెంబర్ 48, 48/1, 48/2 లపై సమగ్రమైన ‘సంయుక్త సర్వే’ నిర్వహించాలని కుత్బుల్లాపూర్ తాహసీల్దార్‌ను ఆదేశించారు. ఒకవేళ ఆ సర్వేలో ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న స్థలంలో ఏ భాగమైనా ప్రభుత్వ భూమి (48/1) అని తేలితే.. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

నెలలు గడిచిన..

అయితే, కోర్టు ఆదేశాలు జారీ చేసి 15 నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో కుత్బుల్లాపూర్ రెవెన్యూ యంత్రాంగం ఆ సంయుక్త సర్వేను పూర్తి చేసిందా? లేదా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి రక్షణకు సంబంధించిన అంశం అయినప్పటికీ, సరిహద్దులు గుర్తించడంలో అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ఈ అలసత్వమే ఆక్రమణదారులకు మరోసారి న్యాయపరమైన లూప్‌హోల్స్ వెతుక్కునే అవకాశం కల్పించిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

‘పిల్’ భయంతోనే ‘రివ్యూ’ దరఖాస్తులు!

కోర్టు రికార్డులను నిశితంగా పరిశీలిస్తే ప్రైవేట్ వ్యక్తులు వేసిన రివ్యూ పిటిషన్ల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు స్పష్టమవుతోంది అని చెప్తున్నారు. 22 డిసెంబర్ 2025 న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వచ్చి 9 నెలలు దాటినా అధికారులు సర్వే చేయలేదని విమర్శలు ఉన్నాయి. కొంపల్లి నివాసి స్పందించి, ఈ యు.ఎల్.సి భూముల అక్రమ విక్రయాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. 30 జనవరి 2026 న ఈ పిల్ కేసు కోర్టులో అధికారికంగా రిజిస్టర్ అవ్వడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే.. ప్రైవేట్ వ్యక్తులు అప్రమత్తమయ్యారు. తీర్పు వచ్చిన పది నెలల దాకా గమ్మున ఉన్న వారు.. హడావుడిగా హైకోర్టులో రివ్యూ పిటిషన్ (IA 4/2026) దాఖలు చేయడం జరిగింది.

ఆలస్యాన్ని మన్నించండి అంటూ..

చట్టప్రకారం తీర్పు వచ్చిన 30 రోజుల్లోపు రివ్యూ వేయాలి. కానీ వీరు 10 నెలలు ఆలస్యంగా వేయడం వల్ల.. కోర్టు ఎక్కడ తిరస్కరిస్తుందోనని భయపడి, IA 1/2026 కింద "మా ఆలస్యాన్ని క్షమించి పిటిషన్‌ను స్వీకరించండి" అంటూ పిటిషన్ దరఖాస్తును కూడా జత చేశారు. ఈ తేదీల క్రమాన్ని బట్టి చూస్తే.. పిల్ కేసు విచారణకు వస్తే కలెక్టర్ ఆర్డర్ పరిధి దాటి తాము చేసిన ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో, కాలయాపన చేసి స్టే తెచ్చుకోవడానికే ఈ రివ్యూ పిటిషన్ డ్రామాకు తెరతీసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

కోర్టు లో ఏం జరుగబోతోంది..?"

ప్రస్తుత కోర్టు రికార్డుల ప్రకారం.. హైకోర్టు ధర్మాసనం ముందు ఈ ‘ఆలస్య క్షమాపణ పిటిషన్’ విచారణకు రానుంది. న్యాయస్థానం గనుక వీరి ఆలస్యాన్ని అంగీకరిస్తేనే ప్రధాన రివ్యూ పిటిషన్ ముందుకు కదులుతుంది. లేదంటే అది అక్కడితోనే కొట్టుకుపోతుంది. ఒకవైపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ సైన్ బోర్డుల తొలగింపు మరియు ఆర్‌ఐ పై దాడి ప్రయత్నంపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు సాగుతుండగా.. మరోవైపు ఈ లీగల్ పోరాటం ఊపందుకోవడం విశేషం. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు కోర్టు ముందు గట్టిగా నిలబడతారా? లేక ప్రైవేట్ వ్యక్తుల కాలయాపన వ్యూహాలకు లొంగిపోతారా? అనేది తెలియాలంటే గురువారం హైకోర్టు వెలువరించే రోజువారీ ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

Next Story