పర్యాటక ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ సమస్య

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల వద్ద పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం పర్యాటకులకు చుక్కలు చూపిస్తోంది.

పర్యాటక ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ సమస్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల వద్ద పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం పర్యాటకులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఫోటో షూట్‌ల అనుమతి కోసం చెల్లిస్తున్న పేమెంట్లకు సంబంధించి ఎలాంటి రశీదులు అందకపోవడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా పర్యాటక ప్రాంతాల్లో ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ లు జరుగుతుంటాయి. లక్నవరం చెరువు దగ్గర ప్రీవెడ్డింగ్ షూట్ కి గంట కు 5 వేల చొప్పున చార్జ్ చేస్తున్నారు. ఇలా చాలా చోట్ల గంటకు రూ. 1000 పైనే పర్యాటక శాఖ వసూలు చేస్తోంది. కానీ ఆ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో ఆయా అంశాలపై ద్రుష్టి సారించాల్సిన పర్యాటక శాఖ కనీస పట్టింపులేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటం చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రశీదు లేదు.. మెసేజ్ రాదు:

సాధారణంగా పర్యాటక ప్రాంతాల్లో వివాహ వేడుకలు, వ్యక్తిగత ఫోటో షూట్‌ల కోసం పర్యాటక శాఖ నిర్దేశించిన అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని సిబ్బంది సూచిస్తున్నారు. అయితే, పేమెంట్ పూర్తయిన తర్వాత పర్యాటక శాఖ నుండి ఎలాంటి అధికారిక మెసేజ్ అలర్ట్ రావడం లేదు. కనీసం మాన్యువల్ రశీదులు కూడా ఇవ్వడం లేదు. చెల్లింపులు ఎవరి ఖాతాకు వెళ్తున్నాయో కూడా స్పష్టత లేని పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.

క్యూఆర్ కోడ్ డిపార్ట్మెంట్ దేనా:

కొన్ని టూరిజం ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్‌లపై శాఖ పేరు, ఖాతా వివరాలు స్పష్టంగా లేకపోవడం, రసీదు లేకుండానే స్క్రీన్‌షాట్ సరిపోతుంది అనే సమాధానం ఇవ్వడం పట్ల పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల చెల్లింపులు మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉందని, అలాగే పర్యాటకుల నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక రంగం రాష్ట్రానికి ఆదాయం తెచ్చే కీలక రంగం కావడంతో, ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు, ఆటోమేటిక్ మెసేజ్ అలర్ట్‌లు, డిజిటల్ రసీదులు తప్పనిసరిగా అందేలా టూరిజం శాఖ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.

నిధులు దుర్వినియోగం అయ్యే ఛాన్స్:

డిజిటల్ చెల్లింపుల తర్వాత ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలోకి చేరుతున్నాయా లేదా సిబ్బంది వ్యక్తిగత ఖాతాలకు వెళ్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము నగదు చెల్లిస్తున్నాం, కానీ దానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి రికార్డు మాకు అందడం లేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వెడ్డింగ్ షూట్ ఆర్గనైజర్ చెబుతున్నాడు. పర్యాటక శాఖ వెంటనే స్పందించి ఆన్ లైన్ చెల్లింపు జరిగిన వెంటనే ఫోన్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేలా చూడాలంటున్నారు. పేమెంట్ చేసిన తర్వాత వెంటనే డౌన్‌లోడ్ చేసుకునేలా డిజిటల్ రశీదును అందుబాటులోకి తేవాలని, అప్పటి వరకు అత్యవసరంగా మాన్యువల్ రశీదులను జారీ చేయాలని కోరుతున్నారు.

Next Story