Q NET : క్యూనెట్ కుంభకోణం గుట్టురట్టు.. మూడు రాష్ట్రాల్లో సోదాలు, 32 మంది అరెస్ట్

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ‘క్యూనెట్’ సంస్థ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు.

Q NET : క్యూనెట్ కుంభకోణం గుట్టురట్టు.. మూడు రాష్ట్రాల్లో సోదాలు, 32 మంది అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరిట కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ‘క్యూనెట్’ (Q NET) సంస్థ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారంతో మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 11 మంది మహిళలు సహా 32 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం బషీర్‌బాగ్ సీసీఎస్‌లో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాతో పంచుకున్నారు. సిద్దిపేటకు చెందిన హరికృష్ణ అనే వ్యక్తి క్యూనెట్ వలలో పడి రూ.5 లక్షలు పోగొట్టుకుని, సంస్థ మోసాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. క్యూనెట్‌పై తెలంగాణ వ్యాప్తంగా 68, హైదరాబాద్‌లో 22 కేసులు (ఇటీవల మరో 4) నమోదయ్యాయి. ఎస్బీ జాయింట్ సీపీ ఆధ్వర్యంలో 30 ప్రత్యేక బృందాలతో మూడు రాష్ట్రాల్లోని 27 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

మోసాల తీరు ఇలా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్

సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. సెకండ్ ఇన్‌కమ్ (అదనపు ఆదాయం) ఆశచూపి స్టార్ హోటళ్లలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. విలాసవంతమైన కార్లు, ఇళ్లు చూపిస్తూ ఐటీ ఉద్యోగులను ప్రధానంగా బురిడీ కొట్టిస్తున్నారు. డబ్బుల్లేని వారికి ప్రైవేట్ ఫైనాన్స్, ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా లోన్లు ఇప్పించి మరీ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. 1998 నుంచి ఈ నిర్వాహకులు వివిధ పేర్లతో చీటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సంస్థ పేరు చెప్పకుండా బాండ్ పేపర్లు రాయించుకుని వెల్‌నెస్ ప్రొడక్ట్స్, బిస్కెట్లు, తేనె వంటి వస్తువుల అమ్మకాల నెపంతో మోసాలకు పాల్పడుతున్నారు.

ఈడీకి సమాచారం.. ప్రజలకు సీపీ హెచ్చరిక

ఈ భారీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నందున, తదుపరి విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం అందజేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల అమాయక ప్రజలు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Next Story