- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్కర స్నానానికి పుష్కలంగా భక్తులు.. నవరత్న మాల హారతికి హాజరు మంత్రి శ్రీధర్ బాబు
పుష్కరస్నానం ఆచరిస్తే.. పుణ్యం దక్కుతుందంటూ పుష్కర స్నానానికి భక్తులు పుష్కలంగా తరలివస్తున్నారు. సరస్వతీ నమోనమామి అంటూ పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు.

దిశ, మల్హర్(కాళేశ్వరం): పుష్కరస్నానం ఆచరిస్తే.. పుణ్యం దక్కుతుందంటూ పుష్కర స్నానానికి భక్తులు పుష్కలంగా తరలివస్తున్నారు. సరస్వతీ నమోనమామి అంటూ పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో అంతర్వాహిని చెంత పలు రాష్ట్రాలకు చెందిన వేలాది భక్తులు పుణ్యస్నానాలాచరించి.. ముక్తీశ్వరుడిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఉదయం వచ్చి రాత్రి జరిగే సరస్వతీ నదీ హారతిచ్చే వరకు ఉండి ఆ మహాఘట్టాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఆరో రోజైన మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘‘కాళేశ్వర నివాసోవా,కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం’’ అని స్తుతిస్తూ భక్తులు త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానమాచరించిన భక్తులు పుణీతులై నీరాజానాలు అర్పిస్తున్నారు.
పుష్కర నదికి మొదటి 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతననుసరించి భక్తులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురణాలు చెప్తున్నాయి. ప్రకృతిలో భాగమైన నదుల వద్ద సహజత్వాన్ని పెంపొందించేందుకు భక్తులు కూడా చొరవ తీసుకోవాలన్న సంకల్పంతోనే హైందవ ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ప్రాకృత్య ధర్మానికి మించింది మరోటి లేదన్నది చేతల్లో చూపించేందుకే పూర్వీకులు ఈ సాంప్రాదాయాలను కొనసాగించే వారు. పుష్కర నది తీరంలో 6వ రోజున ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలని పురణాలు వివరించాయి. ఈ రోజు పుష్కర సరస్వతి ఒడిలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు దానాలు చేయడం చేశారు. కాళేశ్వరం క్షేత్రంలో భక్తులు ముక్తీశ్వరుడిని దర్శనానికి క్యూ లైన్లో బార్లుగా నిలిచారు.
సరస్వతి నవరత్నమాల హారతి
పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్నమాల హారతి మంగళవారం నుంచి ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా ప్రతి రోజు రాత్రి 7.30 గంటల నుండి నిర్వహిస్తున్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని భక్తులు వీక్షించడానికి ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని. దాదాపు 45 నిమిషాల పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను కాశీ పండితులు ఇవ్వనున్నారు.
సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు
ఓంకార హారతి-సర్వ దోష నివారిణి.
నాగ హారతి - సర్పదోషాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
పంచ హారతి - దీర్ఘాయుష్షుకు.
సూర్య హారతి- రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
చంద్ర హారతి - పాడి పంటలను, మన: శాంతినిస్తుంది.
నంది హారతి - ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.
సింహ హారతి-- నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.
కుంభ హారతి - సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.
నక్షత్ర హారతి - నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.
భక్తులకు ఆరోగ్య ఉచిత శిబిరాలు
సరస్వతి పుష్కరాలు సందర్భంగా వచ్చే భక్తుల కోసం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పుష్కరాలు ప్రారంభం నుండి 26వ తేదీ ముగింపు వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ 24X7 మూడు షిప్టులలో వైద్యులు కేటాయించిన శిబిరాలలో వైద్య సేవలు అందిస్తున్నారు.అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేక వైద్య బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. దర్శనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టర్, ఎస్పీ పగడ్బందీ చర్యలు
6వ రోజు కూడా భక్తుల తాకిడీ తీవ్రంగా పెరగడంతో వాహనాల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దర్శనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పగడ్బందీ చర్యలు చేపట్టారు. వారి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సేవలందించే విధుల్లో నిమగ్నం అయింది. త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద భక్తులు నది లోపలకు వెళ్లకుండా ఉండేందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలను, బోట్లు అందుబాటులో ఉంచిన అధికారులు భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా, భక్తులు ప్రయాణించే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రయాణం సాఫీగా జరిగే విధంగా పకడ్భందీ చర్యలు చేపట్టారు. అదేవిధంగా సరస్వతి పుష్కరాలకు వచ్చే మహిళలు సౌకర్యార్థం మాతా శిశు కేంద్రం, షీ గదిని తాత్కాలిక బస్టాండ్లలో ఏర్పాట్లు చేశారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని మహిళలు, పాలిచ్చే తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అతిథుల హాజరు..
సరస్వతి పుష్కర స్నానం ఆచరించిన హై కోర్టు న్యాయమూర్తి సృజన, అనంతరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందచేశారు. అనంతరం ప్రకాశవంతమైన దేవీ ఆరాధనకు కేంద్రంగా నిలిచిన సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం 6వ రోజు మంగళవారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విచ్చేసి సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్యదర్శనం పొందారు.సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక హారతి, ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. 6 రోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే లు పుష్కరాల ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న 6 రోజులు చాలా ముఖ్యమని భక్తులు రద్దీ పెరిగే ఆవకాశం ఉందని ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ డిజి శివధర్ రెడ్డి దంపతులు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు, తల్లిదండ్రులు, ఎస్పి కిరణ్ ఖరే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






