- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: భూముల రీ సర్వే కోసం ఆధునిక 'రోవర్ల' కొనుగోలు
రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన జరిగిన 2026-27 బడ్జెట్ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, అత్యాధునిక 'రోవర్' పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టబోతున్నామని, ఇందుకు సంబంధించి 2026-27 బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం వీటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల వారీగా నిధుల అవసరాల గురించి చర్చించారు.






