- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్, తెలంగాణ బీజేపీ తదుపరి లక్ష్యాలు.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్ లో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (ఎస్ఎస్ఏ)లతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలను నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
90 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు!
ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమావేశాలకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లుగా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించి, కేవలం 30 లక్షల కొత్త ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఒక కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి వారం మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై దృష్టి సారిస్తారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.






