మంత్రి దామోదరకు పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ కీలక రిక్వెస్ట్

by Muthe.Rajitha |

ఇన్-సర్వీస్ పీజీ డాక్టర్లను మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా వెంటనే నియమించాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేశారు.

మంత్రి దామోదరకు పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇన్-సర్వీస్ పీజీ డాక్టర్లను మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా వెంటనే నియమించాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందజేశారు. పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ వైద్యులు పీజీ పూర్తి చేసిన తరువాత మెడికల్ కాలేజీల్లో ల్యాటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నేరుగా నియమించాలని విన్నవించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పునరుద్ధరించిన ఇన్-సర్వీస్ కోటా ద్వారా స్పెషలిస్ట్ ఇన్-సర్వీస్ వైద్యులు తొలి బ్యాచ్‌ 2021లోఎంటర్ అయ్యి 2025 లో కోర్సు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇకపై ప్రతి సంవత్సరం సుమారు 150–250 మంది ఇన్-సర్వీస్ పీజీ వైద్యులు వివిధ స్పెషాలిటీల్లో పట్టభద్రులు అవుతారని, వీరిని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలోని మెడికల్ కాలేజీల్లో నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటే, ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం ఉండదని, విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ కొరత కూడా వెంటనే తీరుతుందని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ సేవల్లో ఉన్న డాక్టర్లను వైద్య విద్యా రంగంలో సమర్థవంతంగా వినియోగించవచ్చునని, ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రభుత్వాలు ఇప్పటికే విజయవంతంగా అనుసరిస్తున్నాయని మంత్రికి వివరించారు.

కాగా ఈ వినతిపై మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు. ఇదే సమావేశంలో వైద్యారోగ్యశాఖలోని హెచ్వోడీలు అయిన ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీఎంఈ, డీహెచ్, సీఎఫ్డబ్ల్యూలను కలిసి వినతిపత్రం అందజేయగా.. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ వైద్య విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ హామీ ఇచ్చింది.

Next Story