ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురూ.. 12 రోజుల అభివృద్ధి జాతర

by Ramesh Naini |   (  Updated:2026-06-02 04:24:42  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురూ.. 12 రోజుల అభివృద్ధి జాతర
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్‌రెడ్డి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో పైలాన్ ఆవిష్కరించి రెండో విడ‌త‌కు శ్రీ‌కారం చుట్టారు.

కార్యాచరణ ఇలా..

జూన్ 1 : లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు- ప్రణాళికలో మొదటి రోజైన జూన్ 1న హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక లక్ష నూతన గృహాలకు భారీ ఎత్తున గృహ ప్రవేశ మహోత్సవాలు నిర్వహించారు. అలాగే కొత్త గృహాల మంజూరుపై సమీక్షలు చేపట్టారు.

జూన్ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

జూన్ 3 : కోహెడ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన.

జూన్ 4 : విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం, పర్యావరణ అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై క్విజ్ పోటీలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు.

జూన్ 5 : వనమహోత్సవం- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో హై-డెన్సిటీ మిశ్రమ ప్లాంటేషన్, వనమహోత్సవం, గ్రీన్ ప్లెడ్జ్ కార్యక్రమాలు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల యాజమాన్యంలోని 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభం.

జూన్ 6 : శాంతిభద్రతలు, పారిశ్రామిక భద్రత- హోంశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, డ్రగ్స్ నిరోధక ప్రచారాలు. జిల్లాస్థాయిలో చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ), సీఐఐ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు, యువజన క్లబ్స్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీలతో కలిసి అవగాహన సదస్సులు.

జూన్ 7 : నగరాల ప్రగతి- మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రూ. 304 కోట్లతో మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి, రూ. 280 కోట్లతో ఉస్మాన్‌సాగర్ తాగునీటి ప్రాజెక్టు, రూ. 229 కోట్లతో నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ బ్రిడ్జి, ఎఫ్‌సీడీఏ కార్యాలయ ప్రారంభం.

జూన్ 8 : రహదారుల జాతర- ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం, నాగర్‌కర్నూల్, నల్లగొండ, మేడ్చల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వందల కోట్ల రహదారి విస్తరణ పనులు, హైలెవెల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవాలు. వరంగల్, కరీంనగర్, ములుగు ఐడీఓసీ భవనాలు, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ వైద్య కళాశాలలు సిద్ధమవుతాయి. ఇంధన శాఖ ఆధ్వర్యంలో 18 సబ్ స్టేషన్ల పరిధిలో 19 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు శంకుస్థాపనలు.

జూన్ 9 : రైతులకు శిక్షణ- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1600 రైతువేదికల ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పంటల వైవిధ్యీకరణ, ఎరువుల సమర్థవంతమైన వినియోగంపై రైతులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. క్రీడా శాఖ ఆధ్వర్యంలో 6 స్పోర్ట్స్ అకాడమీల ప్రారంభం. 9 మల్టీపర్పస్ స్టేడియంలకు శంకుస్థాపన.

జూన్ 10 : మహిళా శిశు సంక్షేమం- సరికొత్త పాలసీ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మొబైల్ అంగన్‌వాడీలు, క్రెచ్‌లను ప్రారంభిస్తారు. టీజీ ఫుడ్స్‌లో రూ.40 కోట్ల ప్లాంట్‌ను, అమీర్‌పేటలో మహిళా-శిశు గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. మానవ అక్రమ రవాణా నిరోధక (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్) నూతన విధానం ఆవిష్కరణ.

జూన్ 11 : వైద్య రంగంలో నూతన విప్లవం- వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన టిమ్స్ సనత్‌నగర్, పటాన్‌చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రారంభం. కొత్తగూడెం, మెదక్, నారాయణపేటలలో క్రిటికల్ కేర్ బ్లాకులు, భువనగిరిలో సెంట్రల్ మెడికల్ స్టోర్ అందుబాటులోకి. అలాగే 572 మంది నూతన హెల్త్‌కేర్ సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ. క్యూర్ రీజియన్‌లో 145 పాలీక్లినిక్స్ ప్రారంభం. సనత్‌నగర్ టిమ్స్‌లో పీజీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనానికి భూమిపూజ.

జూన్ 12 : స్టూడెంట్ కిట్ల పంపిణీ-ప్రణాళిక చివరి రోజున విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్టూడెంట్ వెల్కమ్ కిట్స్ పంపిణీ. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాల నిర్మూలనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున యాంటీ-డ్రగ్స్ ప్రతిజ్ఞ కార్యక్రమంతో 12 రోజుల ప్రణాళిక ముగింపు.

గన్‌పార్క్‌కు సీఎం రేవంత్.. అమరవీరులకు నివాళి

Next Story