సంపాదిస్తున్నాం కానీ మర్చిపోతున్నాం.. వీలునామా లేక కుటుంబాల్లో ఆస్తి వివాదాలు

by Ajay Maddhiboyina |

చాలామంది ఇల్లు కొంటున్నారు, సిప్‌లు చేస్తున్నారు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన ఆర్థిక బాధ్యతను మాత్రం చాలామంది భారతీయులు వాయిదా వేస్తున్నారు. అదే వీలునామా. సంపదను ఎలా సంపాదించాలనే దానిపై గంటల తరబడి చర్చిస్తాం.

సంపాదిస్తున్నాం కానీ మర్చిపోతున్నాం.. వీలునామా లేక కుటుంబాల్లో ఆస్తి వివాదాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: చాలామంది ఇల్లు కొంటున్నారు, సిప్‌లు చేస్తున్నారు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన ఆర్థిక బాధ్యతను మాత్రం చాలామంది భారతీయులు వాయిదా వేస్తున్నారు. అదే వీలునామా. సంపదను ఎలా సంపాదించాలనే దానిపై గంటల తరబడి చర్చిస్తాం. కానీ మన తర్వాత ఆ సంపదకు ఏమవుతుందో మాట్లాడటానికి మాత్రం ఇప్పటికీ వెనుకాడుతున్నాం. ఇదే భవిష్యత్ లో అనేక కుటుంబ వివాదాలకు కారణమవుతోంది.

సంపద సృష్టిలో సూపర్

ఈ రోజుల్లో ఎక్కువమంది గతంలో కంటే చాలా వేగంగా సంపన్నులవుతున్నారు. ఇళ్లు కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ, ‘మనం లేకపోతే ఈ ఆస్తి ఏమవుతుంది?’ అనే ముందస్తు ప్లానింగ్ చేయడంలో మాత్రం దారుణంగా వెనకబడి ఉన్నారు. ప్రముఖ ‘1 ఫైనాన్స్’ మ్యాగజైన్ చేసిన తాజా సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మనదేశంలో దాదాపు 84.8 శాతం మంది అసలు వీలునామా రాయలేదు. అంతకంటే విచిత్రం ఏమిటంటే 62.5 శాతం మందికి అసలు అలాంటి ఆలోచనే లేదు. కేవలం 15.2 శాతం మంది మాత్రమే పక్కాగా లీగల్ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. సగం మంది కుటుంబాల్లో అసలు ఆస్తుల పంపకాల గురించిన చర్చే జరగడం లేదు.

అపోహల వలయం

మనదేశంలో ‘మరణం’ లేదా ‘చావు’ గురించి మాట్లాడటాన్ని ఒక పెద్ద అపశకునంగా చూస్తారు. వీలునామా రాస్తే ముసలివాళ్లయిపోయినట్లేనని, లేదా చావు దగ్గరపడిందని భయపడతారు. ‘మన పిల్లలు మంచోళ్లు, వాళ్లే చూసుకుంటారులే..’ అని చాలామంది వదిలేస్తుంటారు. కానీ ఎస్టేట్ ప్లానింగ్ నిపుణులు, యూనివర్సల్ ట్రస్టీస్ ఎండీ ఆశిష్ నాసా.. ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పద్ధతిలో వారసులకు అందించడమూ అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఇప్పుడు ఆస్తులంటే కేవలం ఇల్లు, బంగారం మాత్రమే కాదు. డిజిటల్ అసెట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, బిజినెస్ షేర్లు, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో ఉంటున్నాయి. సరైన లీగల్ డాక్యుమెంట్ లేకపోతే, మీరు వెళ్ళిపోయాక ఆ ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడం ఫ్యామిలీకి ఒక పెద్దనరకంగా మారుతుంది.

నామినీ అంటే ఓనర్ కాదు

మనవాళ్లలో ఉన్న ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే.. బ్యాంకు అకౌంట్‌లోనో లేదా ఇన్సూరెన్స్‌లోనో ‘నామినీ’ పేరు రాసేస్తే, ఆ ఆస్తి పూర్తిగా వాళ్లదే అయిపోతుందని అనుకుంటారు. కానీ చట్టప్రకారం నామినీ అనే వ్యక్తి కేవలం ఒక ‘ట్రస్టీ’(సంరక్షకుడు) మాత్రమే, ఓనర్ కాదు. నిజమైన లీగల్ వారసులకు ఆ డబ్బులు పంచాల్సిందే. అలాగే, వీలునామా అనేది కేవలం కోట్ల రూపాయలు ఉన్న ధనవంతుల కోసమే అనే భ్రమ కూడా ఉంది. ఇది వయసుతో సంబంధం ఉన్న పనికాదు. జీవితంలోని అనిశ్చితిని ఎదుర్కోవడానికి చేసే ముందస్తు ఏర్పాటని ఆశిష్ స్పష్టం చేస్తున్నారు.

డబ్బు కంటే విలువైన గిఫ్ట్.. ‘నిశ్చింత’

వీలునామా అనేది కేవలం లాయర్లు రాసే ఒక చట్టపరమైన కాగితం కాదు. అది మీ కుటుంబంపై మీకు ఉన్న ప్రేమకు నిదర్శనం. మీ తర్వాత మీ భార్యాపిల్లలు రోడ్డున పడకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా కాపాడే ఒక రక్షణ కవచం. అది దుఃఖాన్ని దూరం చేయలేదు కానీ, అనుమానాలను, గొడవలను వంద శాతం దూరం చేస్తుంది. మనదేశంలో సంపద పెరుగుతోంది, దాంతోపాటే బాధ్యత కూడా పెరగాలి. అందుకే ఈరోజు మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే అతిపెద్ద ఫైనాన్షియల్ గిఫ్ట్ మరో కొత్త ఇన్సూరెన్స్ పాలసీనో, మ్యూచువల్ ఫండో కాదు... ఒక సింపుల్ ‘వీలునామా’! అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story