- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాగైనా గెలిచి తీరాలి... సాధారణ ఎన్నికలను తలదన్నేలా సర్పంచ్ అభ్యర్థుల మేనిఫెస్టోలు
సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు భారీగా హామీలు గుప్పిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ పోరు హీటెక్కుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామస్తులను హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమపై నమ్మకం కలిగేలా ఏకంగా బాండ్ పేపర్లు సైతం రాసిస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ పదవి కోసం గ్రామస్తుల సమక్షంలో ఆశావహులు, అభ్యర్థులు వేలం పాటలకు రెడీ అవుతున్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే చేయబోయే గ్రామానికి చేయబోయే పనులు ఇవేనంటూ ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అభ్యర్థుల హామీల జాబితాలు వైరల్‍గా మారాయి.
ఎమ్మెల్యేల ఎన్నికలను తలదన్నేలా మేనిఫెస్టోలు:
మారుతున్న కాలంతో పాటే సర్పంచ్ ఎన్నికల్లో ఇస్తున్న హామీల ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు పల్లెపోరులో అభ్యర్థులు ఇస్తున్న మేనిఫెస్టోలు ఎమ్మెల్యేల ఎన్నికలను తలదన్నేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థానిక సమస్యలతో పాటు కులాలు, మతాల వారీగా హామీలు ఇస్తునే సామాజిక అంశాలపై కూడా అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు. తమను గెలిపిస్తే చేయబోయే పనులు ఇవేనంటూ మేనిఫెస్టో అంశాలను సోషల్ మీడియాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలోని ఇంటింటికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని అలాగే ఆడబిడ్డ పుడితే రూ. 5 వేలు, ఇల్లు కట్టుకునే వారికి రూ. 21 వేలు, పెళ్లికి పుస్తె, మట్టెలు ఇస్తానని రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఓ అభ్యర్థి హామీలు ఇవ్వగా గద్వాల జిల్లా సల్కాపురంలో ఓ అభ్యర్థి గ్రామంలో ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్లు ఇస్తానని వంద రూపాయల బాండ్ పేపర్ పై ఏకంగా 22 హామీలు రాసి ఇచ్చాడు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్ పదవి నుంచి తప్పుకుంటానని సైతం స్పష్టం చేశారు. దూరపు బంధువులు రాకముందే రక్షణగా మృతదేహాలకు రిఫ్రిజిరేటర్ సదుపాయం, మరణించిన కుటుంబానికి రూ. 3 వేల ఆర్థిక సాహయం కల్పిస్తానంటూ ఖమ్మం జిల్లాలో ఓ మహిళా అభ్యర్థి పలు హామీలు ఇచ్చారు. ఇక ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి తనను గ్రామానికి సర్పంచ్‍గా ఏకగ్రీవం చేస్తే కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తానని ప్రకటించాడు. అంతేగాకుండా ఊర్లోని వీరన్న సామి గుడికి ఎకరం భూమిని విరాళం ఇవ్వడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని బంపరాఫర్ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తగట్టు సర్పంచ్ అభ్యర్థి మాడ స్వాతి వెంకట్‌రెడ్డి తాను గెలిస్తే నెల రోజుల్లో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానంటూ తన మేనిఫెస్టోలోని మొదటి హామీగా ప్రకటించారు. నల్గొండ జిల్లా స్థానిక మండలంలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా రూ. 73 లక్షలతో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి ఈ పోస్టును దక్కించుకున్నారు. ఇక్కడ 16 మంది పోటీలో ఉండగా వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని ప్రకటించారు.
తాజా మాజీల హెచ్చరికలు:
ఇలా గుడులు కట్టిస్తామని, కుల సంఘాలకు పైసలిస్తామని, యువత, మహిళలకు ప్రత్యేక హామీలు ఇస్తూ హోరెత్తిస్తుంటే మరో వైపు హామీలు ఇచ్చే ముందు అభ్యర్థులంతా ఒక్కసారి మా పరిస్థితి ఆలోచించుకోండంటూ తాజా మాజీ సర్పంచ్‍లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కంటే సొంతంగా డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తామని హామీలు ఇస్తుండటంతో గతంలో తాము సర్పంచ్ గిరి చేసి నిండా అప్పుల్లో మునిగిపోయామని ఎడాపెడా హామీలు ఇస్తూ, ఎన్నికల్లో గెలిచేందుకు ఇష్టారీతిగా ఖర్చులు చేసే ముందు ఆలోచించుకోవాలని రాజకీయ పదవుల కోసం మీ సొంత కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టుకోకండని సలహా ఇస్తున్నారు. మొత్తంగా పోటీ పడీ మేనిఫెస్టోలు ఇస్తున్న అభ్యర్థుల్లో ఎంత మంది గెలుస్తారు మరెంత మంది చేతులు కాల్చుకుంటారు అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






