ఎస్ఐఆర్ ప్రక్రియ సంవత్సరం పాటు కొనసాగించాలి: ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించకుండా, కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ సంవత్సరం పాటు కొనసాగించాలి: ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించకుండా, కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఎస్ఐఆర్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తికానుందని, కానీ ఈ సమయం సరిపోదన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని కోదండరాం తెలిపారు. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో తగిన సమయం లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోదండరాం కోరారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వివిధ కారణాలు చూపుతూ పౌరుల ఓటు హక్కును తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. తమకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో 68 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏ ఒక్క పౌరుడు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కోదండరాం స్పష్టం చేశారు. టీజేఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకునేలా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీమ్ పాషా అధ్యక్షత వహించారు. ఈ వర్క్‌షాప్‌లో సామాజిక కార్యకర్తలు ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ ఖాలిఖ్, మారియోస్ ఎస్ఐఆర్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నిజ్జన రమేష్ ముదిరాజ్, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బైరి రమేష్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జస్వంత్ కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story