- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతికేళ్లుగా పాతుకుపోయిన ‘ప్రొఫెసర్లు’..! వైద్య శాఖలో జోరుగా బదిలీల ‘పైరవీ’
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పాతికేళ్లుగా ప్రొఫెసర్లు తిష్ట వేశారు. బదిలీల నుంచి తప్పించుకునేందుకు పైరవీలు, అధికారులకు ముడుపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగైదు ఏండ్ల కన్నా ఎక్కువ కాలం ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయడం సహజం. కానీ వైద్యశాఖలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా పాతికేళ్లుగా సుమారు 20 మంది ప్రొఫెసర్లు ఉస్మానియా, గాంధీ టీచింగ్ ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అందుకోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో తమను అక్కడ నుంచి ఇతర చోట్లకు ట్రాన్స్‌ఫర్ చేయొద్దంటూ లాబీయింగ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్స్ అనే సాకు..
ఉస్మానియా, గాంధీ టీచింగ్ ఆస్పత్రుల్లోని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన సుమారు 20 మంది ప్రొఫెసర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర టీచింగ్ ఆస్పత్రులకు వెళ్లి పనిచేసేందుకు అయిష్టంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ప్రభుత్వాలు మారినా.. సదరు ప్రొఫెసర్లు మాత్రం పైరవీలతో ఆ రెండు ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 25 ఏండ్లుగా అక్కడే వేలాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తమను బదిలీ చేస్తే సూపర్ స్పెషాలిటీ కోర్సులకు, ఎంబీబీఎస్, ఎంఎస్ స్టూడెంట్స్‌కు తీవ్ర నష్టం వస్తుందని, అక్కడ పనిచేసేందుకు అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు ఎవరూ లేరంటూ సాకుగా చూపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ సదరు ప్రొఫెసర్లను అక్కడి నుంచి బదిలీ చేస్తే, ఆయా స్థానాల్లో పనిచేసేందుకు అనుభవం, అర్హులైన ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. పైరవీలు, లాబీయింగ్‌తో సదరు ప్రొఫెసర్లు అక్కడే కొనసాగుతున్నట్టు చెప్తున్నారు.
కీలక అధికారులకు ముడుపులు..
న్యూరోసర్జన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ లాంటి ఇతర సూపర్ స్పెషాలిటీ కోర్సులకు చెందిన ప్రొఫెసర్లు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లకుండా, అక్కడే కొనసాగేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక ఇతర కారణాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పనిచేయడం వల్ల ఉదయం రెండు, మూడు గంటలపాటు డ్యూటీ చేసి, మిగతా సమయం మొత్తం కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రయివేటు ప్రాక్టీస్, సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతినెలా ఒక్కో ప్రొఫెసర్ జీతం కన్నా ఐదారు రేట్ల ఎక్కువ మొత్తాన్ని సంపాదించే వెసులుబాటు ఉంటుంది. అందుకే హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లకుండా సదరు ప్రొఫెసర్లు హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కీలక అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు సైతం సదరు ప్రొఫెసర్లకు మద్దతుగా ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిసింది.






