UGC: అలా వీసీల నియామకం రాజ్యాంగ విరుద్ధం: ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

యూజీసీ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థని, కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు కీలుబొమ్మలా ఆడిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

UGC: అలా వీసీల నియామకం రాజ్యాంగ విరుద్ధం: ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థని, కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు కీలుబొమ్మలా ఆడిస్తూ వర్సిటీల ప్రమాణాలను దిగజార్చే నిర్ణయాలు చేస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదమని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన యూజీసీ నూతన మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 'యూజీసీ 2025 నిబంధనలు - విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిపై దాడి' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాశీం అతిధులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో అభివృద్ధి నినాదం పేరుతో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తూ విద్యా కాషాయికరణకు పూనుకున్నారని ఆరోపించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసిందని, విద్యలో కేంద్ర, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ముసాయిదా ప్రతిపాదనలు ఉంటూ రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీన పరుస్తూ మొత్తంగా ఫెడరల్‌ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. పూర్తిగా గవర్నర్ చేతిలో వీసీల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

Next Story