- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయా ఉదారవాదం మానవత్వాన్ని మింగేస్తోంది.. టీఎస్‌యూటీఎఫ్ స్మారక సభలో ప్రొఫెసర్ జి. విజయ్ కీలక వ్యాఖ్యలు
నయా ఉదారవాద విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంతో పాటు మానవీయ విలువలు, మానవ సంబంధాలను విధ్వంసం చేస్తున్నాయని ప్రొఫెసర్ డా. జి.విజయ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నయా ఉదారవాద విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంతో పాటు మానవీయ విలువలు, మానవ సంబంధాలను విధ్వంసం చేస్తున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి.విజయ్ (Professor G. Vijay) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సంఘం సీనియర్ నాయకులు నాగటి నారాయణ మూడవ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ 'నయా ఉదారవాద అభివృద్ధి, నిరంకుశ పాలనా దశకు సూక్ష్మ పునాదులు' అనే అంశంపై ఉపన్యసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయా ఉదారవాద విధానాల అమలు ఫలితంగా మానవీయ విలువలు, సంబంధాలు మింగేస్తోందని, విద్యా విలువలు వ్యాపారీకరణ అవుతున్నాయని ప్రొఫెసర్ విజయ్ తెలిపారు. సమిష్టి తత్వం పోయి వ్యక్తిగత స్వార్థం, వ్యక్తివాదం పెరిగిందని, ఫలితంగా మనిషిలో మానవత్వం, నీతి, నిజాయితీ, జాలి, దయ వంటి లక్షణాలు బలహీనుల లక్షణాలుగా చిత్రీకరించి వ్యవస్థీకృతం చేశారని వివరించారు. కనీస సామాజిక బాధ్యతను కూడా ఉచితాలుగా మార్చి లబ్ధి పొందే తీవ్రమైన దోపిడీ వ్యవస్థను ఈ విధానాలు నిర్మిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతి వ్యక్తి తన లాభం, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదుటివారిని శత్రువులుగా, పోటీదారులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ వ్యవస్థను కూలదోయాల్సిన కర్తవ్యం సామాజిక స్పృహ ఉన్న అందరిపై ఉందని ప్రొఫెసర్ విజయ్ పిలుపునిచ్చారు.
నాగటి నారాయణ సేవలు స్మరణ:
ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ గౌరవాధ్యక్షుడు పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నాగటి నారాయణ (Nagati Narayana) అట్టడుగు వర్గం నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో జాతీయ స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాట తత్వం, ధృఢమైన నాయకత్వం ఈ తరం నాయకులకు స్ఫూర్తి అని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ, ఈ తరం ఉపాధ్యాయులకు నాగటి నారాయణ చేసిన కృషిని వివరించడం ద్వారా వారిలో సామాజిక బాధ్యతను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. జంగయ్య, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు పి. మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, సోమశేఖర్, నాగమణి, కె. రవికుమార్, శ్రీధర్, సింహాచలం, వెంకటప్ప తదితర రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత నాయకులు నాగటి నారాయణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.






