ముందుగా విధివిధానాలు.. తర్వాతే ఈహెచ్ఎస్ అమలు: ఉద్యోగ సంఘాల డిమాండ్

by Ramesh Naini |

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రవేశపెడుతున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా ఖరారు కాకముందే ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి 1.5 శాతం చందా మినహాయింపు చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ముందుగా విధివిధానాలు.. తర్వాతే ఈహెచ్ఎస్ అమలు: ఉద్యోగ సంఘాల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రవేశపెడుతున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా ఖరారు కాకముందే ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి 1.5 శాతం చందా మినహాయింపు చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో తరచూ మార్పులు జరుగుతుండటంతో అనేక మంది ఉద్యోగులు ఇంకా పూర్తి వివరాలు నమోదు చేయలేకపోయారు. కుటుంబ సభ్యుల అర్హత, భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే చందా మినహాయింపు విధానం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని వారు వాపోతున్నారు.

ఆరోగ్య పథకం అమలుకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చి, పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకుండా ముందస్తుగా వేతనాల్లో కోతలు విధించడం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తక్షణమే జోక్యం చేసుకుని ఈహెచ్ఎస్ చందా పేరిట జరుగుతున్న వేతన కోతలను నిలిపివేసి, పూర్తి స్థాయి విధివిధానాలు ప్రకటించిన తర్వాత మాత్రమే అమలు చర్యలు చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, తపస్ అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్యలు డిమాండ్ చేశారు.

Next Story